టీజీపీసీబీలో తెలంగాణ ప్రజా పాలనా దినోత్సవం
తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (టీజీపీసీబీ), సనత్ నగర్ కార్యాలయంలో తెలంగాణ ప్రజా పాలనా దినోత్సవాన్ని గురువారం దేశభక్తి, గౌరవభావంతో నిర్వహించారు.ఈ కార్యక్రమంలో టీజీపీసీబీ చైర్మన్ శ్రీ రాజశేఖర్ రెడ్డి లక్కాడి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి తెలంగాణ పోరాటంలో త్యాగాలు చేసిన స్వాతంత్ర్య సమరయోధులకు నివాళులర్పించారు. సెప్టెంబర్ 17 చారిత్రక, తెలంగాణ ప్రజలు ప్రదర్శించిన ధైర్యం, సంకల్పం, ఐక్యతను ఆయన గుర్తుచేశారు.
తెలంగాణ సాధించిన ప్రగతి ప్రజల త్యాగాలు, ఆకాంక్షల ఫలితమని ఆయన పేర్ర్కొన్నారు. అభివృద్ధితో పాటు పర్యావరణ పరిరక్షణకు సమాన ప్రాధాన్యం ఇవ్వాలని, సహజ వనరులను కాపాడటం ప్రతి ఒక్కరి సమష్టి బాధ్యత అని అన్నారు.
టీజీపీసీబీ అధికారులు, సిబ్బంది అంకితభావం, నిజాయితీ, నిబద్ధతతో విధులు నిర్వర్తిస్తూ కాలుష్య నియంత్రణ చర్యలను మరింత బలోపేతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. భవిష్యత్ తరాలకు పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన తెలంగాణను అందించేందుకు సుస్థిర అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.
ఐక్యత, సామాజిక బాధ్యత, ప్రజాసేవ విలువలను కాపాడుతూ తెలంగాణ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని, అదే సమయంలో పర్యావరణాన్ని పరిరక్షించాలని చైర్మన్ కోరారు.
కార్యక్రమంలో టీజీపీసీబీ సభ్య కార్యదర్శి జి. రవి, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.