'సెమీకాన్ ఇండియా 2026'ను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ
న్యూఢిల్లీ:న్యూఢిల్లీలోని యశోభూమి కన్వెన్షన్ సెంటర్‌లో 'సెమీకాన్ ఇండియా 2026' ఐదవ ఎడిషన్‌ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గురువారం నాడు ప్రారంభించారు. సెప్టెంబర్ 17 నుండి 19 వరకు మూడు రోజుల పాటు జరిగే ఈ జాతీయ సదస్సు సెమీకండక్టర్, ఎలక్ట్రానిక్స్ రంగాల విస్తరణ, అంతర్జాతీయ భాగస్వామ్యాలు మరియు విధానపరమైన దిశానిర్దేశంపై ప్రధానంగా దృష్టి సారించనుంది.
'ఆత్మనిర్భర్ భారత్' లక్ష్యంతో గత 11 ఏళ్లలో (2014-15 నుండి 2024-25) దేశంలో ఎలక్ట్రానిక్స్ వస్తువుల ఉత్పత్తి రూ. 1.9 లక్షల కోట్ల నుండి ఆరు రెట్లు పెరిగి రూ. 12 లక్షల కోట్లకు చేరగా, ఎగుమతులు రూ. 38,000 కోట్ల నుండి ఎనిమిది రెట్లు పెరిగి రూ. 3.3 లక్షల కోట్లకు చేరాయి. ఇదే సమయంలో మొబైల్ ఫోన్ల ఉత్పత్తి రూ. 18,000 కోట్ల నుండి 28 రెట్లు పెరిగి రూ. 5.45 లక్షల కోట్లకు ఎగబాకింది. ప్రత్యేకించి మొబైల్ ఫోన్ల ఎగుమతులు రూ. 1,500 కోట్ల నుండి ఏకంగా 127 రెట్లు పెరిగి రూ. 2 లక్షల కోట్లకు చేరుకోగా, దేశీయ డిమాండ్‌లో దిగుమతి చేసుకున్న మొబైల్ ఫోన్ల వాటా 75 శాతం నుండి 0.02 శాతానికి పడిపోయింది. దేశంలో డిజైన్, ఫ్యాబ్రికేషన్, అసెంబ్లీ, టెస్టింగ్, ప్యాకేజింగ్‌లతో కూడిన సంపూర్ణ సెమీకండక్టర్ తయారీ వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం 2022లో 'సెమీకాన్ ఇండియా ప్రోగ్రామ్'ను ప్రారంభించిన విషయం తెలిసిందే.