'సెమికాన్ ఇండియా 2026'ను ప్రారంభించనున్న ప్రధాని మోదీ
'సిలికాన్ టు సిస్టమ్స్' థీమ్‌తో ద్వారకాలో సదస్సు
న్యూఢిల్లీ: భారతదేశాన్ని అంతర్జాతీయ సెమీకండక్టర్ హబ్‌గా తీర్చిదిద్దే లక్ష్యంతో నిర్వహించనున్న 'సెమికాన్ ఇండియా 2026' సదస్సును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం ద్వారకాలోని యశోభూమిలో అధికారికంగా ప్రారంభించనున్నారు. "సిలికాన్ టు సిస్టమ్స్: బిల్డింగ్ ది ఎకోసిస్టమ్" అనే ప్రధాన థీమ్‌తో మూడు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో ప్రపంచవ్యాప్త చిప్ తయారీదారులు, పారిశ్రామిక నాయకులు, పెట్టుబడిదారులు మరియు విధాన రూపకర్తలు పాల్గొననున్నారు.
చిప్ డిజైనింగ్, ఫ్యాబ్రికేషన్, ప్యాకేజింగ్, టెస్టింగ్, పరికరాల తయారీ మరియు మానవ వనరుల అభివృద్ధితో సమగ్ర పర్యావరణ వ్యవస్థను నిర్మించడమే ఈ సదస్సు ముఖ్య ఉద్దేశం. గడిచిన దశాబ్ద కాలంలో దేశీయ ఎలక్ట్రానిక్స్ తయారీ రంగం రూ. 1.9 లక్షల కోట్ల నుండి రూ. 13.11 లక్షల కోట్లకు విపరీతంగా పుంజుకోవడమే కాకుండా, పెట్రోలియం, రత్నాల కంటే ఎక్కువగా స్మార్ట్‌ఫోన్‌లు భారతీయ ఎగుమతుల్లో అగ్రస్థానానికి చేరడం ఈ విప్లవాత్మక మార్పునకు బలమైన పునాదిగా నిలిచింది.
దేశీయంగా సెమీకండక్టర్ తయారీని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం రూ. 1,27,500 కోట్ల వ్యయంతో 'సెమికాన్ ఇండియా ప్రోగ్రామ్ 2.0'ను అమలు చేస్తోంది. ఇప్పటివరకు ఆరు రాష్ట్రాల్లో రూ. 1.64 లక్షల కోట్ల పెట్టుబడులతో 12 ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వగా, మూడింటిలో ఇప్పటికే వాణిజ్య ఉత్పత్తి ప్రారంభమైంది. అంతేకాకుండా, చిప్స్ టు స్టార్టప్ (C2S), DLI పథకాలు మరియు 'చిప్‌ఇన్ సెంటర్' ద్వారా రాబోయే కాలంలో 85,000 మంది నైపుణ్యం కలిగిన సెమీకండక్టర్ ఇంజనీర్లను తయారు చేయడమే లక్ష్యంగా ప్రణాళికలు వేగవంతంగా అమలువుతున్నాయి.