మల్లాపూర్ సర్వే నెం. 84/1ను నిషేధిత జాబితా నుంచి తొలగించండి: తహసీల్దార్కు ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి విజ్ఞప్తి
సూర్య ప్రతినిధి, ఉప్పల్: మల్లాపూర్ గ్రామ అబాదీ పరిధిలోని సర్వే నెం. 84/1లో ఉన్న నివాస స్థలాలను నిషేధిత జాబితా నుంచి తక్షణమే తొలగించి, స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి కోరారు. ఈ మేరకు ఆయన ఉప్పల్ మండలం తహసీల్దార్ ఫూల్ సింగ్ను కలిసి వినతిపత్రం అందజేశారు.
సర్వే నెం. 84/1 పరిధిలో స్థానిక ప్రజలు దశాబ్దాలుగా నివాసం ఉంటున్నారని ఎమ్మెల్యే వివరించారు. అయితే ఈ భూములు నిషేధిత జాబితాలో ఉండటం వల్ల స్థానికులకు ఆస్తుల రిజిస్ట్రేషన్లు కావడం లేదని, నూతన ఇంటి నిర్మాణ అనుమతులు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అంతేకాకుండా ఆస్తుల మార్పిడి, క్రయవిక్రయాలు జరగక ప్రజలు అనేక మానసిక, ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్న విషయాన్ని తహసీల్దార్ దృష్టికి తీసుకెళ్లారు.
గ్రామ అబాదీ పరిధిలోని నివాస స్థలాల స్వభావాన్ని పరిగణనలోకి తీసుకుని, నిషేధిత జాబితా అంశాన్ని పరిశీలించి ఉన్నతాధికారుల సమన్వయంతో తగిన పరిష్కారం చూపాలన్నారు. దీనిపై స్పందించిన తహసీల్దార్ ఫూల్ సింగ్, ఈ సమస్యను క్షేత్రస్థాయిలో పరిశీలించి నిబంధనల ప్రకారం ఉన్నతాధికారులకు నివేదించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ వార్డ్ కమిటీ సభ్యుడు ఫైళ్ల ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.