తెలకపల్లి మండలంలో ఎండిన పత్తి పంటలను పరిశీలించిన సీపీఎం నాయకులు.. నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.50 వేల పరిహారం చెల్లించాలి
తెలకపల్లి సూర్య న్యూస్: మండలం పరిధిలోని గడ్డంపల్లి గ్రామంలో ఎండిపోయిన పత్తి పంటలను సీపీఎం పార్టీ మండల నాయకులు పరిశీలించారు ఈ సందర్భంగా మండల నాయకులు నందిపేట భాస్కర్ మాట్లాడుతూ పంటలు ఎండిపోవడంతో నష్టపోయిన రైతులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఎకరాకు రూ.50 వేల చొప్పున పరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. పత్తి పంటలపై పెట్టుబడులు పెట్టి, ఆశించిన దిగుబడి రాక నష్టపోతున్న రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. పంటలు ఎండిపోయి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులకు తక్షణమే నష్టపరిహారం అందించి, వ్యవసాయ రంగాన్ని ఆదుకునేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఉపాధి హామీ కూలీలకు ఏడాదికి 360 రోజుల పని కల్పించాలి
అనంతరం గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను కూడా సిపిఎం మండల నాయకులు నందిపేట భాస్కర్ పరిశీలించారు. ఉపాధి హామీ కూలీల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కూలీలకు ఏడాదిలో 360 రోజుల పని దినాలు కల్పించడంతో పాటు రోజువారీ కూలీని రూ.600కు పెంచాలని డిమాండ్ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో కూలీలకు ఉపాధి భద్రత కల్పించి, పెరుగుతున్న నిత్యావసర ధరలకు అనుగుణంగా కూలీ రేట్లు పెంచాలని కోరారు.రైతుల పంట నష్టాలకు పరిహారం అందించడం, ఉపాధి హామీ కూలీలకు మెరుగైన వేతనాలు, పని దినాలు కల్పించడం ద్వారా గ్రామీణ ప్రజల ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఎం గ్రామ శాఖ కార్యదర్శి జగదీశ్ బాబు, రైతులు పోతోళ్ల కాశన్న, చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.