మేడారం దేవస్థానానికి రూ. 5 లక్షల కరెంట్ బిల్లు షాక్!
ములుగు: ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మేడారంలో సాగుతున్న అభివృద్ధి పనుల వేళ విద్యుత్ బిల్లుల అంశం వివాదాస్పదంగా మారింది. డిసెంబరు నుంచి మార్చి నెలల మధ్య సాగిన పనులకు సంబంధించి ఏకంగా రూ. 5 లక్షల కరెంటు బిల్లు రావడం స్థానికంగా చర్చనీయాంశమైంది.
మేడారం ఆలయ పునరుద్ధరణ, అభివృద్ధి పనుల కోసం కాంట్రాక్టర్లు భారీ యంత్రాలు, విద్యుత్ పరికరాలను వినియోగించారు. అయితే దీని కోసం ప్రత్యేక విద్యుత్ కనెక్షన్ తీసుకోకుండా, పూర్తిగా దేవస్థానానికి చెందిన ట్రాన్స్‌ఫార్మర్ నుంచే విద్యుత్‌ను వాడటంతో ఈ స్థాయిలో బిల్లు వచ్చింది. ఇంత పెద్ద మొత్తంలో వచ్చిన కరెంటు బిల్లును ఎలా చెల్లించాలనే దానిపై మేడారం ఈవో వీరస్వామి, సంబంధిత కాంట్రాక్టర్‌తో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.
కాంట్రాక్టర్లు చేసిన అభివృద్ధి పనుల కరెంటు బిల్లును దేవస్థానం నిధుల నుంచి ఎలా చెల్లిస్తారని ఆలయ పూజారులు ప్రశ్నిస్తున్నారు. ఆలయ సొమ్మును ఇందుకు వాడటానికి వీల్లేదని, సదరు కాంట్రాక్టర్ నుంచే ఆ బిల్లు మొత్తాన్ని వసూలు చేసి కట్టించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
అభివృద్ధి పనుల తీవ్రత వల్ల ఆ నాలుగు నెలల కాలంలోనే అధిక బిల్లు వచ్చిందని, ప్రస్తుతం సాధారణ స్థాయిలోనే వినియోగం ఉందో లేదో అధికారులు పరిశీలిస్తున్నారు.