నేపాల్‌లో ఆకస్మిక వరదల విధ్వంసం
కాఠ్మండు: నేపాల్‌లోని ఉత్తర రసువా జిల్లాలో బుధవారం ఉదయం సంభవించిన భారీ ఆకస్మిక వరదలు తీవ్ర తీవ్ర విధ్వంసాన్ని సృష్టించాయి. ఈ ప్రమాదంలో కనీసం ఏడుగురు మృతి చెందగా, 12 మంది సాయుధ పోలీసు బలగాల అధికారులు గల్లంతయ్యారు. టిబెట్ సరిహద్దు సమీపంలో చోటుచేసుకున్న ఈ విపత్తులో భారీగా ప్రాణనష్టం జరిగి ఉండవచ్చని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 9 గంటలకు టిబెట్ దిశ నుండి భోటే కోషి నదిలోకి ఒక్కసారిగా వరద నీరు వచ్చి చేరింది. నీటిమట్టం అకస్మాత్తుగా పెరగడంతో తిమురే, ష్యాఫ్రుబేసి ప్రాంతాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. జలవిద్యుత్ ప్రాజెక్టులు, మార్కెట్లు, రోడ్లతో పాటు పలు వాహనాలు, ఆస్తులు కొట్టుకుపోయాయి.
రసువా జిల్లా నుంచి 12 మంది సాయుధ పోలీసు అధికారులు గల్లంతవ్వగా, విధ్వంసం కారణంగా మరికొందరు భద్రతా సిబ్బందితో సంబంధాలు తెగిపోయాయి.విపత్తు తీవ్రతపై నేపాల్ ప్రధాని బాలేంద్ర షా అత్యవసర సమావేశం నిర్వహించారు. బాధితులను కాపాడేందుకు వైద్య బృందాలు, నేపాల్ ఆర్మీ, స్కౌట్స్ మరియు రెడ్ క్రాస్ సంస్థలతో సహాయక చర్యలను వేగవంతం చేశారు.