ఉల్లి, చక్కెర ధరలు పెరిగితే NAFED నుండి సేకరణ
ఢిల్లీ ముఖ్యమంత్రి సీఎం రేఖా గుప్తా
న్యూఢిల్లీ: ఢిల్లీలో ఉల్లిపాయలు, చక్కెర లభ్యత మరియు ధరలపై ముఖ్యమంత్రి రేఖా గుప్తా అధ్యక్షతన మంగళవారం సమీక్షా సమావేశం జరిగింది. ప్రస్తుతం నగరంలో ఎలాంటి కొరత లేనప్పటికీ, ఒకవేళ ధరలు పెరిగితే ప్రజలపై భారం పడకుండా కేంద్ర ప్రభుత్వ సంస్థ 'నాఫెడ్' (NAFED) నుండి వీటిని సేకరించి అందుబాటు ధరలకే విక్రయిస్తామని సీఎం స్పష్టం చేశారు.
నాఫెడ్ నుండి సేకరించిన ధరలకే ఉల్లి, చక్కెరలను ప్రజలకు అందిస్తారు. రవాణా మరియు ఇతర నిర్వహణ ఖర్చులను ఢిల్లీ ప్రభుత్వమే భరిస్తుంది. మార్కెట్‌కు సరఫరా సక్రమంగా జరిగేలా చూడటంతో పాటు, అక్రమ నిల్వలను (బ్లాక్ మార్కెటింగ్) అరికట్టాలని సంబంధిత శాఖను సీఎం ఆదేశించారు. ధరలు పెరిగే సూచనలు ఉంటే, నగరంలోని ప్రాంతాల్లో ప్రత్యేక క్యాంపుల ద్వారా తక్కువ ధరకే ఉల్లిని పంపిణీ చేయడానికి సమగ్ర కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం చక్కెర అక్రమ నిల్వలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆహార, సరఫరా శాఖ మంత్రి సర్దార్ మంజిందర్ సింగ్ సిర్సా వెల్లడించారు.