హెలికాప్టర్ ఇంజన్ 'అరవల్లి' తయారీకి హెచ్‌ఏఎల్-సాఫ్రాన్ చారిత్రాత్మక ఒప్పందం
బెంగళూరు: భారత రక్షణ, ఏరోస్పేస్ రంగంలో మరో ఘనత నమోదైంది. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) మరియు ఫ్రాన్స్‌కు చెందిన సాఫ్రాన్ హెలికాప్టర్ ఇంజన్స్ సంస్థలు సంయుక్తంగా కొత్త తరం శక్తివంతమైన హెలికాప్టర్ ఇంజన్ “అరవల్లి” ని అభివృద్ధి చేయనున్నాయి. ఈ మేరకు 'సాఫ్హాల్ హెలికాప్టర్ ఇంజన్స్ ప్రైవేట్ లిమిటెడ్' (SAFHAL) తో తుది ఒప్పందంపై సంతకాలు చేశాయి.
3,500 నుండి 4,000 షాఫ్ట్ హార్స్‌పవర్ (shp) సామర్థ్యం కలిగిన ఈ హై-పవర్ ఇంజన్ యొక్క రూపకల్పన, అభివృద్ధి, తయారీ, సరఫరా మరియు లైఫ్‌టైమ్ సపోర్ట్ బాధ్యతలను సాఫ్హాల్ పర్యవేక్షిస్తుంది. హెచ్‌ఏఎల్ భవిష్యత్తులో రూపొందించనున్న 13-టన్నుల స్వదేశీ విమానాలు అయిన 'ఇండియన్ మల్టీ-రోల్ హెలికాప్టర్' (IMRH) మరియు నావికాదళానికి చెందిన 'డెక్-బేస్డ్ మల్టీ-రోల్ హెలికాప్టర్' (DBMRH) లలో ఈ ఇంజన్‌ను అమర్చనున్నారు.
ఏరో-ఇంజన్ సాంకేతికతలో భారతదేశం స్వయం సమృద్ధి సాధించడానికి మరియు స్వదేశీ డిఫెన్స్ రంగాన్ని బలోపేతం చేయడానికి ఈ ప్రాజెక్ట్ ఎంతగానో దోహదపడుతుందని హెచ్‌ఏఎల్ యాజమాన్యం స్పష్టం చేసింది. సాఫ్రాన్ కంపెనీ తొలిసారిగా ఈ కేటగిరీకి చెందిన ఇంజన్‌ను సంయుక్తంగా అభివృద్ధి (Co-development) చేస్తుండటం విశేషం. ఇది ఇరు దేశాల రక్షణ బంధంలో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. సైనిక ప్రయోజనాలతో పాటు, భవిష్యత్తులో పౌర విమానయాన రంగానికి (సివిల్ హెలికాప్టర్లు) కూడా ఈ సాంకేతికతను విస్తరించే అవకాశాలు ఉన్నాయి.