ఒకే వ్యక్తికి రెండు మరణ ధృవీకరణ పత్రాల జారీ
నాగర్ కర్నూలు: విధుల నిర్వహణలో తీవ్ర నిర్లక్ష్యం వహిస్తూ, ఒకే వ్యక్తికి రెండు వేర్వేరు తేదీలతో మరణ ధృవీకరణ పత్రాలు జారీ చేసిన బొమ్మనపల్లి పంచాయతీ కార్యదర్శి వి. రమేష్ బాబును జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్ తక్షణమే సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం బొమ్మనపల్లి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
తెలుగు దినపత్రికల్లో “ఒక్కరికీ రెండు ధృవపత్రాలు” శీర్షికతో వచ్చిన కథనాలపై స్పందించిన అచ్చంపేట డివిజనల్ పంచాయతీ అధికారి విచారణకు ఆదేశించారు. అధికారుల సమగ్ర విచారణలో పంచాయతీ కార్యదర్శి ఆన్‌లైన్ రికార్డుల్లో రెండుసార్లు వేర్వేరు తేదీలతో మరణ వివరాలు నమోదు చేయగా, బౌతిక రిజిస్టర్‌లో మాత్రం ఒకేసారి నమోదు చేసినట్లు తేలింది. రికార్డుల నిర్వహణలో తీవ్ర లోపాలు, అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు విచారణలో నిర్ధారణ కావడంతో తెలంగాణ సివిల్ సర్వీసెస్ (సీసీఏ) రూల్స్, 1991 ప్రకారం ఆయనపై సస్పెన్షన్ వేటు వేశారు. ఈ వివరాలను నాగర్ కర్నూల్ జిల్లా పంచాయతీ అధికారి శ్రీరాములు వెల్లడించారు.