పోషక మాసం లక్ష్యాల సాధనకు అన్ని శాఖలు సమన్వయంతో కృషి చేయాలి
అదనపు కలెక్టర్ దేవ సహాయం
నాగర్‌కర్నూల్: పోషక మాసం లక్ష్యాల సాధనకు వివిధ ప్రభుత్వ శాఖలు సమన్వయంతో కృషి చేయాలని నాగర్‌కర్నూల్ జిల్లా అదనపు కలెక్టర్ దేవ సహాయం అధికారులను ఆదేశించారు. సెప్టెంబర్ 9 నుండి అక్టోబర్ 8 వరకు నిర్వహించే పోషణ్ అభియాన్ – పోషక మాసం కార్యక్రమాలపై కలెక్టరేట్‌లో గురువారం నిర్వహించిన వివిధ శాఖల అధికారుల సమన్వయ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
“హమారీ అంగన్వాడీ–హమారీ భాగ్యదారి” నినాదంతో పోషక మాసం కార్యక్రమాలను జిల్లాలో విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. గర్భిణీలు, బాలింతలు, చిన్నారులు మరియు కిశోర బాలికలలో పోషకాహార లోపాలను గుర్తించి వారికి సకాలంలో సమతుల్య ఆహారం అందించాలని సూచించారు. పిల్లల ఆరోగ్యకరమైన ఎదుగుదలకు, రక్తహీనత నివారణకు మరియు తల్లిపాల ప్రాముఖ్యతపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని పేర్కొన్నారు.
వైద్య ఆరోగ్య, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, విద్య, మున్సిపల్ మరియు మహిళా-శిశు సంక్షేమ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి నాగర్‌కర్నూల్‌ను పోషకాహార లోప రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, స్వయం సహాయక సంఘాల మహిళలు, అంగన్వాడీ, ఆశా కార్యకర్తలను భాగస్వామ్యం చేయాలని స్పష్టం చేశారు. అనంతరం పోషక మాసం రోజువారీ కార్యక్రమాల అవగాహన పోస్టర్‌ను ఆవిష్కరించి, అధికారులతో పోషణ్ అభియాన్ ప్రతిజ్ఞ చేయించారు.