- అబ్దుల్ అజీజ్ పై బురదజల్లితే.. సూర్యుడిపై ఉమ్మేసినట్టే - టీడీపీ మైనారిటీ నేతలు
- అబ్దుల్ అజీజ్ పై బురదజల్లితే.. సూర్యుడిపై ఉమ్మేసినట్టే - టీడీపీ మైనారిటీ నేతలు
- అబ్దుల్ అజీజ్ ను విమర్శించే ముందు ఆయన చరిత్ర తెలుసుకోండి
- 14 ఏళ్ల ప్రజాజీవితంలో అవినీతి మచ్చలేని నాయకుడు అబ్దుల్ అజీజ్
- మేయర్‌గా అభివృద్ధికి చిరునామా.. వక్ఫ్ బోర్డు చైర్మన్‌గా దేశానికే ఆదర్శం
- 44 కోట్లు సూట్‌కేసుల్లో వచ్చిన రాజకీయ డబ్బు కాదు.. పక్కా లెక్కలున్న వ్యాపార రుణం
- అబ్దుల్ అజీజ్ ను కించపరచాలనే ఆత్రంలో ముస్లిం సమాజాన్నే అవమానిస్తున్నారు.
- ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారు.
నెల్లూరు సిటీ,మేజర్ న్యూస్ : నెల్లూరు నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ మైనారిటీ జిల్లా అధ్యక్షుడు మొయినుద్దీన్, జిల్లా అధికార ప్రతినిధి సాబీర్ ఖాన్, రాష్ట్ర మైనారిటీ నాయకుడు హయాత్ బాబా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మేయర్‌గా నెల్లూరు నగర అభివృద్ధిపై చెరగని ముద్ర వేసి, ప్రతిపక్షంలో తెలుగుదేశం పార్టీకి అండగా నిలిచి, ప్రస్తుతం ఏపీ రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్‌గా సంస్కరణలు, విద్యా కార్యక్రమాలతో ముస్లిం సమాజానికి కొత్త దిశ చూపిస్తున్న అబ్దుల్ అజీజ్‌పై రాజకీయ కక్షతో బురదజల్లే ప్రయత్నాలను నెల్లూరు ప్రజలు నమ్మరని స్పష్టం చేశారు. శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి చేసిన వ్యాఖ్యలను వక్రీకరించి బురదజల్లుతున్నారని అన్నారు. 14 ఏళ్ల ప్రజాజీవితంలో ఒక్క అవినీతి మచ్చ చూపించలేని వారు ఇప్పుడు అధికారిక వ్యాపార రుణాన్ని పట్టుకుని అబ్దుల్ అజీజ్ వ్యక్తిత్వాన్ని దెబ్బతీయాలని చూస్తున్నారు. అబ్దుల్ అజీజ్‌పై బురదజల్లడం అంటే సూర్యుడిపై ఉమ్మేయడమే.. అది తిరిగి మీ మీదే పడుతుంది” అని ఘాటుగా హెచ్చరించారు. అబ్దుల్ అజీజ్‌కు సంబంధించిన ₹44 కోట్ల వ్యవహారంపై జరుగుతున్న ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు. మంత్రి పొంగూరు నారాయణకు సంబంధించిన ₹30 కోట్లు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి సంబంధించిన ₹14 కోట్లు ఎన్నికల ముందు రాత్రికి రాత్రే వచ్చిన సూట్‌కేసుల డబ్బులు కావని, ఎన్నికలు ముగిసిన తర్వాత జరిగిన, లెక్కల్లో నమోదైన వ్యాపార రుణ లావాదేవీలని స్పష్టం చేశారు. షేర్లు, ఆస్తులను భద్రతగా ఉంచి, రాతపూర్వక ఒప్పందాలతో, వడ్డీతో తీసుకున్న రుణాన్ని రాజకీయ లావాదేవీగా చిత్రీకరించడం దురుద్దేశపూర్వకమన్నారు. “ఒక వ్యక్తి తన వ్యాపార అవసరాల కోసం అధికారికంగా రుణం తీసుకుంటే ముస్లిం కమ్యూనిటీని అమ్మేశారని ఎలా అంటారు? వ్యాపార రుణానికి మొత్తం ముస్లిం సమాజానికి సంబంధం ఏమిటి?” అని ప్రశ్నించారు. శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి కూడా తన వ్యాఖ్యలలో అఫీషియల్ గా ట్రాన్స్ఫర్ చేశామని అంశాన్ని మాట్లాడారని, దానిని వైసీపీ నాయకులు వేరే విధంగా వక్రీకరిస్తున్నారని అన్నారు. అబ్దుల్ అజీజ్ అంటే ఏమిటో వైఎస్సార్‌సీపీ నాయకులు చెప్పాల్సిన అవసరం లేదని, ఆయన వ్యక్తిత్వం, ప్రజాజీవితం ఏమిటో నెల్లూరు ప్రజలకు బాగా తెలుసన్నారు. అబ్దుల్ అజీజ్ మేయర్‌గా ఉన్న సమయంలో మంత్రి నారాయణ నేతృత్వంలో నెల్లూరు నగరంలో వేల కోట్ల రూపాయల అభివృద్ధి జరిగిందని గుర్తుచేశారు. అవినీతి చేయాలనే ఉద్దేశం ఉంటే మేయర్‌గా ఉన్నప్పుడే వందల కోట్లు సంపాదించే అవకాశాలు ఉండేవి. కానీ అబ్దుల్ అజీజ్ అవినీతికి దూరంగా నిలిచారు. 14–15 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఒక్క అవినీతి మచ్చ చూపించలేని వారు ఇప్పుడు అకస్మాత్తుగా ఆయనను అవినీతిపరుడిగా చిత్రీకరిస్తే ప్రజలు నమ్ముతారా? అని ప్రశ్నించారు. వక్ఫ్ బోర్డు చైర్మన్‌గా అబ్దుల్ అజీజ్ ‘తాలీమ్-ఎ-హునర్’ ద్వారా పేద, ప్రతిభావంతులైన ముస్లిం విద్యార్థులకు ఉన్నత విద్యావకాశాలు కల్పిస్తున్నారని పేర్కొన్నారు. మంత్రి నారాయణ సహకారంతో సుమారు ₹20 కోట్ల CSR నిధులతో డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు దిశగా కృషి చేస్తున్నారని తెలిపారు. గత 40–50 ఏళ్లలో ముస్లిం సమాజం విద్య, భవిష్యత్తు కోసం ఇంత పెద్ద స్థాయిలో ఆలోచించిన నాయకుడు ఎవరో చూపించండి. అబ్దుల్ అజీజ్ పదవి కోసం రాజకీయాలు చేసే నాయకుడు కాదు.. తనకు వచ్చిన ప్రతి పదవిని ప్రజలకు, సమాజానికి ఉపయోగపడే వేదికగా మార్చిన నాయకుడు” అని పేర్కొన్నారు. అబ్దుల్ అజీజ్ అన్ని జమాత్‌లను “అమ్మేశారు” అంటూ చేసిన వ్యాఖ్యలపై నేతలు తీవ్రంగా మండిపడ్డారు. “జమాత్ పెద్దలు అమాయకులా? ఎవరైనా అమ్మితే అమ్ముడుపోయే వ్యక్తులా? ముస్లిం సమాజం అమ్ముడుపోయే సమాజం కాదు. అజీజ్‌ను రాజకీయంగా దెబ్బతీయాలనే తొందరలో మత పెద్దలను, జమాత్‌లను, మొత్తం ముస్లిం సమాజాన్నే అవమానిస్తున్నారు” అని హెచ్చరించారు. అబ్దుల్ అజీజ్‌పై ప్రెస్‌మీట్లు పెట్టి రాజకీయంగా హైలైట్ అయిపోవాలని భావిస్తే ప్రజల్లో పలుచనవుతారని వ్యాఖ్యానించారు. “పిచ్చిపట్టిన డాబర్‌మాన్‌లా ఎవరు పడితే వారిపై మొరిగే వారికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. కానీ వారి అబద్ధాలతో ప్రజలు గందరగోళానికి గురికాకూడదనే వాస్తవాలను చెబుతున్నాం” అని ఘాటుగా స్పందించారు. ఇలాంటి ప్రెస్‌మీట్లు పెట్టి ముస్లిం సమాజం పరువు తీయకండి. మత పెద్దలను అవమానించకండి. మీకు చేతనైతే అబ్దుల్ అజీజ్‌లా ప్రజల్లో నిలబడి, సమాజానికి ఏదైనా చేసి రాజకీయంగా ఎదగడం నేర్చుకోండి” అని హితవు పలికారు. మేయర్‌గా నగరాభివృద్ధి, ప్రతిపక్షంలో పార్టీ పరిరక్షణ, జిల్లా అధ్యక్షుడిగా కార్యకర్తలకు అండ, వక్ఫ్ బోర్డు చైర్మన్‌గా సంస్కరణలు, తాలీమ్-ఎ-హునర్ ద్వారా పేద విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు, అంతర్జాతీయ స్థాయి పాఠశాల ఏర్పాటు ప్రయత్నం—ఇవన్నీ అబ్దుల్ అజీజ్ ప్రజాజీవితానికి నిలువెత్తు నిదర్శనాలని నేతలు పేర్కొన్నారు. ముస్లిం సమాజం నాయకులను ప్రేమిస్తే గుండెల్లో పెట్టుకుంటుంది. అదే సమాజాన్ని, మత పెద్దలను అవమానిస్తే రాజకీయంగా తగిన సమాధానం చెబుతుంది. ఇదే ధోరణి కొనసాగితే రేపు వైఎస్సార్‌సీపీ నాయకులు ఒక్క ముస్లిం ఇంటి గడప కూడా తొక్కలేని పరిస్థితి వస్తుంది” అని హెచ్చరించారు. రాజకీయ విమర్శలు చేయండి.. అంశాలపై మాట్లాడండి. కానీ పక్కా రికార్డులతో జరిగిన వ్యాపార రుణాన్ని వక్రీకరించి అబ్దుల్ అజీజ్ వ్యక్తిత్వాన్ని, ముస్లిం సమాజ గౌరవాన్ని దెబ్బతీయాలని చూస్తే చూస్తూ ఊరుకోం. అబద్ధాలతో అబ్దుల్ అజీజ్ చరిత్రను చెరపలేరు. ఆయనకు సర్టిఫికెట్ ఇవ్వాల్సింది రాజకీయ ప్రత్యర్థులు కాదు.. పదిహేనేళ్లుగా ఆయన ప్రజాజీవితాన్ని చూస్తున్న ప్రజలు అని స్పష్టం చేశారు. నన్నే సాహెబ్, కరిముల్లా, జహీర్, ఇంతియాజ్, రియాజ్, ఖాదర్ బాషా, ఇక్బాల్, పాషా మొహిద్దిన్, జాఫర్, నౌషాద్, జహీర్, ఖలీల్, కలేషా, ఉస్మాన్, గౌజ్ బాషా, ఎస్సార్ అలీ, ఆబీద్ తదితరులు పాల్గొన్నారు.