telanagana
ఈ-వ్యర్థాలపై అవగాహనతోనే పర్యావరణ పరిరక్షణ - ఏరియా జీఎం కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమం
సూర్య, మందమర్రి : మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని సింగరేణి వ్యాప్తంగా అక్టోబర్ 2 నుంచి 31 వరకు నిర్వహిస్తున్న ప్రత్యేక స్వచ్ఛత కార్యక్రమంలో భాగంగా శుక్రవారం మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్ కార్యాలయంలో ఈ-వేస్ట్ సేకరణ, తొలగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏరియా జీఎం ఎన్. రాధాకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్యాలయ పరిసరాల్లో నిరుపయోగంగా ఉన్న మానిటర్లు, కీబోర్డులు, మౌస్‌లు, ఎలక్ట్రికల్ స్పేర్ పార్ట్స్ తదితర ఎలక్ట్రానిక్ వ్యర్థాలను సేకరించి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన డబ్బాలో వేశారు. ఈ సందర్భంగా జీఎం రాధాకృష్ణ మాట్లాడుతూ ఎలక్ట్రానిక్ వ్యర్థాలను సాధారణ చెత్తతో కలపకుండా ప్రత్యేకంగా సేకరించి శాస్త్రీయ పద్ధతిలో తొలగించాలని సూచించారు. పాత మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లు, వైర్లు, స్విచ్‌లను ఎక్కడపడితే అక్కడ పడేయకుండా నిర్దేశిత విధానంలో పారవేయాలని పిలుపునిచ్చారు. కార్యాలయాలు, గనులను పరిశుభ్రంగా ఉంచడంతోపాటు భూగర్భ, వాతావరణ కాలుష్యాన్ని నివారించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్వో టు జీఎం జి.ఎల్. ప్రసాద్, డీజీఎం (పర్సనల్) సీహెచ్. అశోక్, ఏజీఎంలు బాలాజీ భగవతీ జా, ఆర్.వి.ఎస్.ఆర్.కే. ప్రసాద్, డీజీఎం (సర్వే) బుఖ్యా దేశాయి, ఐటీ డిప్యూటీ మేనేజర్ రవి, పర్చేస్ అధికారి బాబు, ఏరియా అటవీ శాఖ అధికారి నవీన్‌తోపాటు కార్యాలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.