మూలపేట పోర్టు అభివృద్ధికి కేంద్రం సహకారం అందించాలి: కేంద్ర మంత్రి సోనోవాల్‌తో భేటీలో సీఎం చంద్రబాబు విజ్ఞప్తి!
సూర్య న్యూఢిల్లీ డెస్క్: శ్రీకాకుళం జిల్లాలోని మూలపేట పోర్టును వేగవంతంగా అభివృద్ధి చేయడం ద్వారా ఉత్తరాంధ్ర ముఖచిత్రం సమూలంగా మారుతుందని, ప్రాంతీయ వాణిజ్య కార్యకలాపాలు మరింతగా ఊపందుకుంటాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాల శాఖ మంత్రి శర్బానంద సోనోవాల్‌తో సమావేశమైన సీఎం చంద్రబాబు.. రాష్ట్రంలో పోర్టు ఆధారిత మౌలిక వసతుల విస్తరణపై సమగ్రంగా చర్చించారు.
మూలపేట పోర్టుకు అత్యంత కీలకమైన ప్రత్యేక కార్గో టెర్మినల్, కార్గో హ్యాండ్లింగ్ వ్యవస్థలు మరియు ఇతర అనుబంధ మౌలిక సదుపాయాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారాన్ని, నిధులను అందించాలని ఈ సందర్భంగా చంద్రబాబు కోరారు. ఒడిశా, ఛత్తీస్‌గఢ్ వంటి పొరుగు రాష్ట్రాలకు సైతం సముద్ర వాణిజ్యానికి ఇది గేట్‌వేగా మారుతుందని, భారీ స్థాయిలో ప్రైవేట్ పెట్టుబడులు తరలిరావడంతో పాటు ఉత్తరాంధ్ర నిరుద్యోగ యువతకు పెద్ద సంఖ్యలో ఉపాధి అవకాశాలు లభిస్తాయని వివరించారు.
అలాగే తిరుపతి జిల్లా దుగరాజపట్నంలో షిప్ బిల్డింగ్ క్లస్టర్ ఏర్పాటుకు కేంద్రం చొరవ తీసుకోవాలని పునరుద్ఘాటించారు. రాష్ట్రంలోని పోర్టుల అనుసంధానం, సాగరమాల ప్రాజెక్టుల కింద ప్రతిపాదిత ఫిషింగ్ హార్బర్ల పనులను వేగవంతం చేసేందుకు సహాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. చంద్రబాబు ప్రతిపాదనలపై కేంద్ర మంత్రి శర్బానంద సోనోవాల్ సానుకూలంగా స్పందిస్తూ, ఏపీ తీరప్రాంత అభివృద్ధికి, మూలపేట ప్రాజెక్టుకు కేంద్రం నుంచి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని భరోసా ఇచ్చారు.