హోర్ముజ్ జలసంధిలో ఎల్పీజీ ట్యాంకర్‌పై ప్రక్షేపకాల దాడి
సూర్య అంతర్జాతీయ డెస్క్: అత్యంత కీలకమైన అంతర్జాతీయ సముద్ర రవాణా మార్గమైన హోర్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై దాడుల పరంపర తీవ్ర కలకలం రేపుతోంది. జలసంధి గుండా ప్రయాణిస్తున్న ఒక ఎల్పీజీ ట్యాంకర్‌ను గుర్తుతెలియని ప్రక్షేపకాల నుండి వెలువడిన శిథిలాలు బలంగా తాకినట్లు యునైటెడ్ కింగ్‌డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ వర్గాలు వెల్లడించాయి. నౌక కెప్టెన్ అందించిన సమాచారం ప్రకారం ఓడలోని సిబ్బంది అందరూ సురక్షితంగా ఉన్నారని, ఎలాంటి ఇంధన లీకేజీలు లేదా పర్యావరణ నష్టం వాటిల్లలేదని స్పష్టమైంది. ఈ ఘటనపై విచారణ కొనసాగుతుండగానే ఆ ట్యాంకర్ తన తదుపరి గమ్యస్థానానికి ప్రయాణాన్ని కొనసాగిస్తోందని అధికారులు తెలిపారు.
హోర్ముజ్ జలమార్గంలో ఒకే రోజు రెండు వేర్వేరు నౌకలపై దాడులు నమోదు కావడం సముద్ర రవాణా రంగాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. అంతకుముందు రోజు జలసంధిలోకి వస్తున్న మరొక చమురు ట్యాంకర్‌ను గుర్తుతెలియని వస్తువు ఢీకొనడంతో ఇద్దరు సిబ్బందికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటనలో కూడా ఎలాంటి పర్యావరణ ముప్పు వాటిల్లలేదని, నౌక తన సొంత శక్తితో సమీపంలోని రేవుకు చేరుకుంటోందని సైనిక వర్గాలు వెల్లడించాయి. వరస ఘటనల నేపథ్యంలో ఆ ప్రాంతంలో ప్రయాణించే వాణిజ్య నౌకలు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని, ఎలాంటి అనుమానాస్పద కదలికలు కనిపిచినా తక్షణమే సమాచారం అందించాలని యూకేఎమ్‌టీఓ ఆదేశించింది.
గత కొన్ని రోజులుగా ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ఇక్కడ కఠిన ఆంక్షలు విధించడంతో ఈ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. నిబంధనలను ఉల్లంఘించి చట్టవిరుద్ధంగా ప్రయాణించేందుకు ప్రయత్నించిన టోగో జెండా కలిగిన ట్రెండ్ అనే చమురు ట్యాంకర్‌పై దాడులు చేసి నిలిపివేసినట్లు ఇరాన్ నావికాదళం ఇప్పటికే ప్రకటించింది. అమెరికా సైనిక బలగాలు రెచ్చగొట్టడం వల్లే ఆయా నౌకలు నిబంధనలు దాటుతున్నాయని, హోర్ముజ్ జలసంధి తమ పూర్తి నియంత్రణలో ఉందని ఇరాన్ స్పష్టం చేసింది. అంతర్జాతీయంగా అత్యంత కీలకమైన ఈ ఇంధన సరఫరా మార్గంలో దాడులు పెరగడం ప్రపంచ ఇంధన మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి.