దక్షిణాఫ్రికాలోని ఫీనిక్స్ సెటిల్‌మెంట్‌లో ఆయుర్వేద వనం :మూలికా వైద్య పరిరక్షణకు భారత్ ముందడుగు
సూర్య అంతర్జాతీయ డెస్క్: దక్షిణాఫ్రికాలోని డర్బన్ సమీపంలో మహాత్మా గాంధీ చారిత్రక ప్రాధాన్యత కలిగిన 'ఫీనిక్స్ సెటిల్‌మెంట్' ప్రాంగణంలో సాంప్రదాయ ఆయుర్వేద మూలికలు, ఔషధ మొక్కల తోటను మంగళవారం ఘనంగా ప్రారంభించారు. దక్షిణాఫ్రికాలో న్యాయవాదిగా పనిచేస్తున్న సమయంలో, 1904లో మహాత్మా గాంధీ స్వయంగా స్థాపించిన తొలి ఆశ్రమ ప్రాంగణం ఇదే కావడం విశేషం.
భారతీయ సనాతన వైద్య విధానమైన ఆయుర్వేద ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పడంతో పాటు ప్రకృతి జీవనం, మూలికా వైద్యం పట్ల గాంధీజీకి ఉన్న అపారమైన విశ్వాసానికి గౌరవసూచకంగా ఈ ప్రాజెక్టును చేపట్టారు. డర్బన్‌లోని భారత కాన్సులేట్ జనరల్ సహకారంతో ఫీనిక్స్ సెటిల్‌మెంట్ ట్రస్ట్ సంయుక్తంగా ఈ వనాన్ని అభివృద్ధి చేసింది.
ఈ ఉద్యానవనంలో రోగనిరోధక శక్తిని పెంచే తులసి, అశ్వగంధ, తిప్పతీగ, కలబంద సహా పలు అరుదైన ఔషధ మొక్కలను నాటారు. దక్షిణాఫ్రికా సమాజానికి ఆయుర్వేద సంరక్షణ పద్ధతులపై అవగాహన కల్పించే పరిశోధన మరియు ప్రదర్శన కేంద్రంగా ఈ తోట ఉపయోగపడుతుందని ప్రతినిధులు తెలిపారు. ఇరు దేశాల మధ్య సాంస్కృతిక బంధాలను బలోపేతం చేయడంలో ఈ ఆయుర్వేద వనం ఒక జీవకళగా నిలుస్తుందని ప్రారంభోత్సవంలో వక్తలు పేర్కొన్నారు