ఐరాసలో ఇజ్రాయెల్ సైనిక చర్యలపై నిజాన్ని చెప్తా
న్యూయార్క్ మేయర్‌కు నెతన్యాహు ఘాటు కౌంటర్
సూర్య అంతర్జాతీయ డెస్క్: ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో ఈ వారం ప్రసంగించనున్న ఇజ్రాయెల్ ప్రధాని బెన్యామిన్ నెతన్యాహు, పాలస్తీనియన్లపై తమ దేశ సైన్యం చేపట్టిన చర్యలను సమర్థించుకుంటూ నిజాలను ప్రపంచం ముందు ఉంచుతానని స్పష్టం చేశారు. అదే సమయంలో న్యూయార్క్ నగర మేయర్ జోహ్రాన్ మమ్‌దానీ ఇజ్రాయెల్‌పై చేసిన తీవ్ర విమర్శలకు గట్టి ఎదురుదెబ్బ తగిలేలా ఘాటు వ్యాఖ్యలు చేశారు. న్యూయార్క్ మేయర్ నెతన్యాహును "యుద్ధ నేరస్థుడు" అని, పాలస్తీనియన్లపై జరిగిన "దారుణ నరమేధానికి రూపశిల్పి" అని వ్యాఖ్యానించిన నేపథ్యంలో నెతన్యాహు ఒక వీడియో ప్రకటన విడుదల చేస్తూ ఈ కౌంటర్ ఇచ్చారు.
ఐక్యరాజ్యసమితి వేదికగా తాము నిజాలను వెల్లడించడానికి వస్తున్నామని, ఇజ్రాయెల్ ధైర్యవంతులైన సైనికుల గురించిన వాస్తవాలను, అలాగే మేయర్ మమ్‌దానీ అసలు స్వరూపాన్ని ప్రపంచానికి తెలియజేస్తానని నెతన్యాహు పేర్కొన్నారు. హమాస్ తీవ్రవాదులకు మద్దతు ఇస్తూ న్యూయార్క్‌లోని యూదులపై దాడులకు పురికొల్పుతున్నారంటూ మేయర్‌పై మండిపడ్డారు. గతంలో మమ్‌దానీ నెతన్యాహును అరెస్టు చేస్తామని వ్యాఖ్యానించినప్పటికీ, తనకు అలాంటి అధికారం లేదని తర్వాత ఒప్పుకున్న విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు.
అంతర్జాతీయ సమాజంలో ఇజ్రాయెల్‌పై తప్పుడు ప్రచారం జరుగుతోందని, ఈ అబద్ధపు కథనాలను తిప్పికొట్టడానికి ఐక్యరాజ్యసమితి వేదికను ఉపయోగించుకుంటామని ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం తెలిపింది. అక్టోబర్ 7 దాడుల తర్వాత ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ చేపట్టిన చర్యలు హమాస్ సైనిక మరియు పాలనా వ్యవస్థలను అంతం చేయడానికేనని స్పష్టం చేసింది. నెతన్యాహు గురువారం ఐరాస సర్వసభ్య సమావేశంలో ప్రసంగించనుండటంతో ఈ పరిణామాలు అంతర్జాతీయ వేదికపై తీవ్ర ఉత్కంఠను రేపుతున్నాయి.