సల్మా ఖాన్, తండ్రి సలీమ్ ఖాన్ వివాహాన్ని వ్యతిరేకించిన తాత.. అసలు నిజం బయటపెట్టిన సల్మాన్ ఖాన్!
సూర్య ఎంటర్టైన్మెంట్ డెస్క్: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తన కుటుంబ జీవితానికి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను అభిమానులతో పంచుకున్నారు. ప్రముఖ రియాలిటీ షో బిగ్ బాస్ వేదికగా సల్మాన్ ఖాన్ తన తల్లిదండ్రులు సలీమ్ ఖాన్, సల్మా ఖాన్ ల వివాహానికి సంబంధించి పలు ఆశ్చర్యకరమైన జ్ఞాపకాలను పంచుకున్నారు. తమ వివాహ సమయంలో తన తల్లి తండ్రి అంటే తన మాతృమూర్తి తరఫు తాతయ్య సలీమ్ ఖాన్తో విభేదించారని, దాదాపు ఐదేళ్ల పాటు ఆయనతో మాట్లాడలేదని సల్మాన్ ఖాన్ వెల్లడించారు.
ఈ వివాహం వెనుక ఎలాంటి మతపరమైన అంశాలు లేవని, కేవలం సినీ రంగానికి చెందిన వ్యక్తిని తన కూతురు పెళ్లాడుతుందనే భయమే తాతయ్య వ్యతిరేకతకు ప్రధాన కారణమని సల్మాన్ స్పష్టం చేశారు. అప్పట్లో సలీమ్ ఖాన్ మంచి రూపంతో పాటు నటుడిగా స్థిరపడేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో సల్మాన్ తల్లిని వివాహం చేసుకున్నారు. అయితే తన కూతురు ఆ సినీ వాతావరణంలో ఎలా జీవించగలదోనన్న ఆందోళనతో తాతయ్య ఈ పెళ్లిని తీవ్రంగా వ్యతిరేకించారని, అయితే కుటుంబంలోని మిగతా తోబుట్టువులు మాత్రం సలీమ్ ఖాన్ను ఇష్టపడ్డారని ఆయన తెలిపారు.
పెళ్లి తర్వాత సుమారు ఐదేళ్ల పాటు సలీమ్ ఖాన్తో మాట్లాడటం మానేసిన తాతయ్య, ఆ తర్వాత కాలంలో మనవళ్ల ఎదుగుదలను చూసే అవకాశం కోల్పోయానని ఎంతో పశ్చాత్తాపపడ్డారని సల్మాన్ గుర్తుచేసుకున్నారు. తమ్ముడు సొహైల్ ఖాన్ పుట్టిన సమయంలో తాతయ్య స్వయంగా మిఠాయిల డబ్బాతో మహీమ్ నుంచి బాంద్రాకు వచ్చి తన తండ్రిని కలిశారని తెలిపారు. అంతేకాకుండా తన తల్లిదండ్రుల మధ్య ఏవైనా గొడవలు జరిగి తల్లి పుట్టింటికి వెళ్తే, అనవసరంగా గొడవపడి వస్తే ఇంట్లోకి రానిచ్చేవాడు కాదని, భర్త ఉండే ఇంటికే వెళ్లాలని తన తాతయ్య కఠినంగా చెప్పేవారని సల్మాన్ ఆనాటి రోజులను ఎంతో భావోద్వేగంగా పంచుకున్నారు.
Also Read: సౌర శక్తి సాంకేతికతల ఎగుమతులపై చైనా ఆంక్షలు