సౌర శక్తి సాంకేతికతల ఎగుమతులపై చైనా ఆంక్షలు
సూర్య బిజినెస్ డెస్క్: ప్రపంచ సోలార్ మార్కెట్లో తన ఆధిపత్యాన్ని మరింత కాపాడుకునే దిశగా చైనా కీలక నిర్ణయం తీసుకుంది. సోలార్ ప్యానెళ్లు, సిలికాన్ వేఫర్లు మరియు ఇతర సోలార్ పరికరాల తయారీ సాంకేతికతలతో పాటు కీ ప్రొడక్షన్ టెక్నాలజీల ఎగుమతులపై నూతన ఆంక్షలు విధించేందుకు చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రతిపాదించింది. తమ దేశీయ రక్షణ, జాతీయ ప్రయోజనాలను కాపాడుకోవడంతో పాటు పరిజ్ఞానం వేరే దేశాలకు అక్రమంగా చేరకుండా అడ్డుకోవడమే ఈ నిర్ణయం వెనుక ముఖ్య ఉద్దేశమని చైనా అధికారిక వర్గాలు పేర్కొన్నాయి.
చైనా ప్రకటించిన ఈ నూతన ముసాయిదా జాబితాలో సోలార్ ఫోటోవోల్టాయిక్ (PV) తయారీకి చెందిన 12 కీలక సాంకేతికతలతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), బయోమెడిసిన్ రంగాలకు చెందిన మొత్తం 40 రకాల సాంకేతికతలను చేర్చారు. ముఖ్యంగా అడ్వాన్స్డ్ పెరోవ్స్కైట్ అండ్ టాన్డెమ్ సెల్స్, వేఫర్ థిక్నెస్ ప్రాసెసింగ్ మరియు పాలిసిలికాన్ తయారీ సాంకేతికతల ఎగుమతులపై నిషేధం లేదా తీవ్ర పరిమితులు విధించాలని చైనా నిర్ణయించింది. ప్రపంచవ్యాప్తంగా క్లీన్ ఎనర్జీ మరియు సోలార్ ఎనర్జీ వైపు దేశాలు వేగంగా అడుగులు వేస్తున్న సమయంలో చైనా తీసుకున్న ఈ నిర్ణయం తీవ్ర ప్రభావం చూపనుంది.
ప్రస్తుతం గ్లోబల్ సోలార్ తయారీ రంగంలో చైనా దాదాపు 80 శాతానికి పైగా ఆధిపత్యాన్ని కలిగి ఉంది. భారత్, అమెరికా మరియు ఐరోపా దేశాలు స్వదేశీ సోలార్ తయారీ రంగాన్ని ప్రోత్సహిస్తూ చైనాపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని చూస్తున్న తరుణంలో చైనా ఈ వ్యూహాత్మక అడుగు వేసింది. చైనా ప్రతిపాదించిన ఈ ఎగుమతి నియంత్రణల వల్ల ఇతర దేశాల్లో అత్యాధునిక సోలార్ ప్లాంట్ల ఏర్పాటు మందగించే అవకాశం ఉందని అంతర్జాతీయ రంగానికి చెందిన పారిశ్రామిక విశ్లేషకులు భావిస్తున్నారు.
ఈ నూతన ఆంక్షల ముసాయిదాపై చైనా ప్రభుత్వం నవంబర్ 15 వరకు ప్రజలు మరియు పారిశ్రామిక వర్గాల అభిప్రాయాలను స్వీకరించనుంది. ఈ గడువు ముగిసిన వెంటనే కొత్త నిబంధనలు అధికారికంగా అమలులోకి రానున్నాయి. చైనా నిర్ణయంతో భారత్ సహా పలు దేశాల సోలార్ తయారీదారులు తమ భవిష్యత్తు ఉత్పత్తి వ్యూహాలను మరియు సాంకేతిక భాగస్వామ్యాలను పునఃపరిశీలించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.