డెక్కన్ గోల్డ్ మైన్స్ భారీ ఖనిజ నిక్షేపాల గుర్తింపు
సూర్య బిజినెస్ డెస్క్: ప్రముఖ మైనింగ్ అన్వేషణ సంస్థ డెక్కన్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ (DGML) ఛత్తీస్‌గఢ్‌లోని తమ ప్రాజెక్టులో భారీ ఎత్తున కీలక ఖనిజ (క్రిటికల్ మినరల్) నిల్వలను గుర్తించినట్లు వెల్లడించింది. కంపెనీ నిర్వహించిన తాజా అన్వేషణ, సాంకేతిక అధ్యయనాల ప్రకారం ఈ ప్రాజెక్ట్ పరిధిలో 4 మిలియన్ టన్నులకు పైగా అధిక నాణ్యత గల క్రిటికల్ మినరల్స్ లభ్యత సామర్థ్యం ఉన్నట్లు ప్రాథమిక అంచనాల్లో తేలింది. ఈ ప్రకటనతో దేశీయ గనుల రంగంలో డెక్కన్ గోల్డ్ మైన్స్ వాటాదారుల్లో నూతనోత్సాహం వ్యక్తమవుతోంది.
ఛత్తీస్‌గఢ్ ప్రాజెక్టులో లభ్యమైన ఈ ఖనిజ నిక్షేపాలు స్వచ్ఛ ఇంధన సాంకేతికతలు, ఎలక్ట్రిక్ వాహనాల (EV) బ్యాటరీలు, ఆధునిక ఎలక్ట్రానిక్స్ మరియు రక్షణ రంగాలకు అత్యంత కీలకమైనవని కంపెనీ వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం దేశం ఈ కీలక ఖనిజాల కోసం అధికంగా దిగుమతులపై ఆధారపడుతున్న తరుణంలో, ఈ స్థాయి నిల్వలు వెలుగుచూడటం దేశీయ సరఫరా వ్యవస్థలకు పెద్ద ఊరటగా నిలవనుంది. లభ్యత నిరూపితమైన ప్రాంతాల్లో తదుపరి దశ డ్రిల్లింగ్, మైనింగ్ ప్రణాళికలను వేగవంతం చేసేందుకు అవసరమైన నియంత్రణ అనుమతుల ప్రక్రియను కంపెనీ ముమ్మరం చేసింది.
పర్యావరణ హితమైన మరియు అత్యాధునిక మైనింగ్ పద్ధతులను అనుసరిస్తూ ప్రాజెక్ట్‌ను వాణిజ్య స్థాయికి తీసుకెళ్లేందుకు కసరత్తు చేస్తున్నామని కంపెనీ యాజమాన్యం స్పష్టం చేసింది. భారత్‌లో వ్యూహాత్మక ఖనిజాల స్వయం సమృద్ధిని సాధించే లక్ష్యానికి ఈ ప్రాజెక్ట్ గణనీయమైన ఊతాన్ని ఇస్తుందని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ తాజా పరిణామం కంపెనీ దీర్ఘకాలిక విలువను పెంచడమే కాకుండా ప్రాంతీయ ఆర్థిక వృద్ధికి, స్థానిక ఉపాధి కల్పనకు తోడ్పడనుందని అంచనా.