వెలుగొండ జలాల విడుదల, వైసీపీ నేతలకు మింగుడు పడటంలేదు..
వెలుగొండ జలాల విడుదల, వైసీపీ నేతలకు మింగుడు పడటంలేదు..
ఎంపీ మాగుంట పై వైకాపా నేతల అనుచిత వ్యాఖ్యలను ఖండించిన గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల
ఒంగోలు పార్లమెంటు సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారి పై వైకాపా నేతలు చేసిన అనుచిత వ్యాఖ్యలను, విమర్శలను గిద్దలూరు శాసనసభ్యలు ముత్తుముల అశోక్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. బుధవారం ఉదయం గిద్దలూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే అశోక్ రెడ్డి మాట్లాడుతూ వైకాపా నేతల రాజకీయ తీరు పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆగస్టు 31న వెలుగొండ జలాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఒంగోలు ఎంపీ శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు పశ్చిమ ప్రకాశం ప్రాంత అభివృద్ధి పై, ఈ ప్రాంత ప్రజల పై ఉన్న తీవ్రమైన ప్రేమ మరియు భావోద్వేగంతో మాట్లాడుతూ, గత వైకాపా పాలనలో వెలుగొండ ప్రాజెక్టుకు జరిగిన అన్యాయాన్ని గుర్తు చేసుకుంటూ వైఎస్ జగన్ రెడ్డి వైఖ రిపై విమర్శలు చేశారు. అయితే, ఆ సమయంలో భావోద్వేగపూరితంగా జరిగిన అంశాన్ని వైకాపా నాయకులు పెద్ద భూతద్దంలో పెట్టి చూపిస్తూ, మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారి వంటి సీనియర్ నాయకుడి పై అనుచిత వ్యాఖ్యలు చేయడం మరియు విమర్శలకు దిగడం సరికాదని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట ప్రకారమే వెలుగొండ జలాలను విడుదల చేసి పశ్చిమ ప్రకాశం ప్రజల కళ్ళల్లో ఆనందం నింపారని, జలాల విడుదల వల్ల పశ్చిమ ప్రకాశ ప్రాంతమంతా ప్రకాశిస్తుంటే వైకాపా నేతలకు మింగుడు పడటం లేదని అశోక్ రెడ్డి అన్నారు. ఆ ఓర్వలేనితనంతోనే ఎంపీ మాగుంట పై లేనిపోని విమర్శలు చేస్తున్నారని, మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన వారని, వారి కుటుంబం పశ్చిమ ప్రకాశంతో పాటు ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించి ప్రజల మన్ననలు పొందిందని గుర్తుచేశారు. అలాంటి మచ్చలేని కుటుంబం పై వైకాపా నేతలు తమ అక్కసు వెళ్లగక్కడం సరికాదన్నారు.ప్రభుత్వం వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేసి ప్రజలకు నీరు అందించిన అంశం నుంచి ప్రజల దృష్టిని పక్కదారి పట్టించేందుకే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇటువంటి 'టాపిక్ డైవర్షన్' రాజకీయాలకు పాల్పడుతోందని ధ్వజమెత్తారు. వైకాపా నాయకులది నీచ సంస్కృతి అని గత ఐదేళ్ల పాలనలో వారు చేసిన అరాచకాలు, అసభ్యకర వ్యాఖ్యలు, బూతు పురాణాల చరిత్రను రాష్ట్ర ప్రజలు ఎవరూ మర్చిపోలేదని, ఇతరులను విమర్శించే ముందు తమ గత చరిత్రను ఒకసారి గుర్తు చేసుకోవాలని హితవు పలికారు. ఇకనైనా వైకాపా నేతలు తమ వైఖరిని మార్చుకుని హుందా రాజకీయాలు చేయాలని, లేనిపక్షంలో రాష్ట్ర ప్రజలే తగిన బుద్ధి చెబుతారన్నారు.ఈ కార్యక్రమంలో కంభం మార్కెట్ యార్డ్ చైర్మన్ పూనూరు భూపాల్ రెడ్డి, గిద్దలూరు పట్టణ అధ్యక్షులు సయ్యద్ శానేశా వలి, సొసైటీ బ్యాంక్ చైర్మన్ దుత్తా బాల ఈశ్వరయ్య, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ గోడి ఓబుల్ రెడ్డి, టీడీపీ సీనియర్ నాయకులు గుంటక కొండయ్య యాదవ్, దప్పిలి కాశిరెడ్డి, ఎడమకల్లు సొసైటీ బ్యాంక్ చైర్మన్ బిజ్జం రవీంద్రా రెడ్డి, పట్టణ మాజీ కౌన్సిలర్లు లోక్కు రమేష్, మండ్ల శ్రీను, మాజీ రజడ్పీటీసీ బత్తిని వెంకటేశ్వర్లు, బిజ్జం వెంకటరామిరెడ్డి, నాగేశ్వర రెడ్డి, మట్టా రమేష్, వెంకటేశ్వర్లు, సూరా బాలిరెడ్డి తదితరులు పాల్గొన్నారు..