స్థానిక ఎన్నికలు, దృష్ట్యా శాంతి భద్రతల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలి. సీఐ విద్యాసాగర్
ఆలమూరు మేజర్ న్యూస్ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా గ్రామాల్లో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజలందరూ పోలీసు శాఖకు సంపూర్ణంగా సహకరించాలని రావులపాలెం రూరల్ సీఐ సిహెచ్. విద్యాసాగర్ విజ్ఞప్తి చేశారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ రాహుల్ మీనా ఐపీఎస్ ఉత్తర్వులు, కొత్తపేట డీఎస్పీ ఆదేశాల మేరకు మూలస్థానం గ్రామంలో చేపట్టిన 'పల్లె నిద్ర' కార్యక్రమంలో భాగంగా గ్రామస్తులతో ప్రత్యేక అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రావులపాలెం రూరల్ సీఐ విద్యాసాగర్తో పాటు ఆలమూరు ఎస్సై నరేష్ మరియు పోలీస్ సిబ్బంది పాల్గొని ప్రజలకు, యువతకు పలు కీలక అంశాలపై దిశానిర్దేశం చేశారు.
సదస్సులో సీఐ విద్యాసాగర్ మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో, నిష్పక్షపాతంగా జరిగేలా ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా శాంతిభద్రతలను కాపాడాలని కోరారు. జాతీయ రహదారులపై రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రయాణికులు తగిన జాగ్రత్తలు పాటించాలని, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని స్పష్టం చేశారు. మద్యం లేదా మాదకద్రవ్యాలు సేవించి వాహనాలు నడిపితే కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. గంజాయి, సింథటిక్ డ్రగ్స్ వంటి మత్తు పదార్థాల వినియోగం మరియు అక్రమ రవాణా వల్ల యువత భవిష్యత్తు నాశనమవుతుందని, వీటి బారిన పడకుండా జాగ్రత్త వహించాలని సూచించారు.
ప్రస్తుతం సమాజంలో వేగంగా విస్తరిస్తున్న సైబర్ మోసాల పట్ల ప్రజలు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని, గుర్తుతెలియని వ్యక్తులకు ఓటీపీలు, బ్యాంకింగ్ వివరాలు పంచుకోవద్దని అవగాహన కల్పించారు. మహిళలపై జరిగే నేరాల నివారణకు పోలీస్ శాఖ అత్యున్నత ప్రాధాన్యత ఇస్తోందని, ఆపద సమయంలో పోలీస్ వ్యవస్థను ఆశ్రయించి భద్రత పొందవచ్చని వివరించారు. నిరుద్యోగ యువత పెడదోవ పట్టకుండా సన్మార్గంలో నడుస్తూ తమ ఉజ్వల భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని, గ్రామంలో ఎలాంటి అనుమానాస్పద వ్యక్తులు లేదా అసాంఘిక కార్యకలాపాలు కనిపించినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని అధికారులు గ్రామస్తులకు పిలుపునిచ్చారు.