స్టార్ హీరో జన్మదిన వేడుకల్లో పాల్గొన్న బొండా ఉమా
ప్రభాస్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న బొండా ఉమా
విజయవాడ, మేజర్ న్యూస్:
రెబల్ స్టార్ ప్రభాస్ తెలుగు సినీ ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటుతూ, మానవత్వానికి ప్రాధాన్యమిస్తున్న గొప్ప నటుడని ప్రభుత్వ విప్, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. ప్రభాస్ జన్మదినోత్సవం సందర్భంగా శుక్రవారం ముత్యాలంపాడులోని సిటీ వైడ్ ప్రభాస్ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు దెందుకూరి మురళీకృష్ణంరాజు కార్యాలయం వద్ద నిర్వహించిన వేడుకల్లో బొండా ఉమా పాల్గొని కేక్ కట్ చేసి ప్రభాస్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభాస్ పాన్ ఇండియా నటుడిగా కోట్లాది మంది అభిమానుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారని, ప్రకృతి వైపరీత్యాలు, ఇతర ఆపదల సమయంలో బాధితులను ఆదుకునేందుకు ముందుకు రావడం ఆయన సేవా దృక్పథానికి నిదర్శనమని పేర్కొన్నారు. తన నటన, కృషి, పట్టుదలతో తెలుగు సినిమా ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్తున్నారని కొనియాడారు. ప్రభాస్ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని, ఆయన నటిస్తున్న ‘ఫౌజీ’ చిత్రం ఘనవిజయం సాధించి సరికొత్త రికార్డులు సృష్టించాలని, ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ నియోజకవర్గ కోఆర్డినేటర్ నవనీతం సాంబశివరావు, దాట్ల రాజేష్ వర్మ, సోమన అనిల్, మనీష్ వర్మ, రాఘవేంద్ర రాజు, అబ్బులు, బోస్, రామకోటయ్య, శ్రీను, రామకృష్ణ, నాగరాజు తదితరులు పాల్గొని ప్రభాస్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.