సైదాపురంలో జోరుగా ఎంపీటీసీ నామినేషన్లు -రెండు రోజుల్లో 54 నామినేషన్లు.. టీడీపీ, వైసీపీల మధ్య పోటీ!
సైదాపురం, మేజర్ న్యూస్ : సైదాపురం మండలంలో ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ జోరుగా సాగుతోంది. మండలంలోని 12 ఎంపీటీసీ స్థానాలకు రెండు రోజుల్లో మొత్తం 54 నామినేషన్లు దాఖలయ్యాయి. మొదటి రోజు బుధవారం తెలుగుదేశం పార్టీ తరఫున 16, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున 18, బీజేపీ తరఫున ఒక నామినేషన్ నమోదైనట్లు సమాచారం.రెండో రోజు గురువారం కూడా నామినేషన్ల సందడి కొనసాగింది. టీడీపీ తరఫున 8, వైసీపీ తరఫున 6, బీజేపీ తరఫున 2, స్వతంత్ర అభ్యర్థులుగా ఇద్దరు నామినేషన్లు దాఖలు చేశారు. గురువారం సాయంత్రం 5.20 గంటల సమయానికి 19 నామినేషన్లు నమోదైనట్లు సైదాపురం మండల రిటర్నింగ్ అధికారి శ్రీనివాసరావు తెలిపారు.మండలంలోని 12 ఎంపీటీసీ స్థానాలకు ఇప్పటికే 54 నామినేషన్లు చేరడంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. శుక్రవారం నామినేషన్ల దాఖలుకు చివరి రోజు కావడంతో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని, 100 నామినేషన్లకు చేరవచ్చని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.