సబ్ జైలులో ఘనంగా ఖైదీల సంక్షేమ దినోత్సవం.
కావలి మేజర్ న్యూస్ : కావలి సబ్ జైలు నందు శుక్రవారం ఖైదీల సంక్షేమ దినోత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కావలి అడిషనల్ జుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ గౌరవనీయులైన జి. విక్రమ్ సిన్హా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఖైదీలను ఉద్దేశించి మాట్లాడుతూ, హింసను వీడి అహింసా మార్గంలో ప్రయాణించాలని పిలుపునిచ్చారు. ప్రతీ ఒక్కరూ సత్ప్రవర్తన కలిగి ఉండి, నేర ప్రవృత్తికి దూరంగా ఉండాలని సూచించారు. సజావుగా శిక్షా కాలం పూర్తి చేసుకుని, తిరిగి సమాజంలో జనజీవన స్రవంతిలో కలవాలని ఆకాంక్షించారు. ఖైదీల ఉపాధి, సంక్షేమం కోసం ప్రభుత్వం కల్పిస్తున్న వివిధ మార్గాలను, అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఆదర్శవంతమైన జీవితాన్ని గడపాలని హితవు పలికారు. అనంతరం జైలు పరిసరాలను, ఖైదీలకు అందుతున్న ప్రాథమిక వసతులు మరియు సౌకర్యాలను మేజిస్ట్రేట్ పరిశీలించి, అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఖైదీలకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో లీగల్ ఎయిడ్ మెంబర్ ఐ. సాయి ప్రసాద్, లోక్ అదాలత్ మెంబర్ ఎం. మాలకొండ రెడ్డి, జైలు సూపరింటెండెంట్ చిన్న సుబ్బయ్య, జైలు సిబ్బంది మరియు ఖైదీలు పాల్గొన్నారు.