మహర్షి వాల్మీకి జయంతిని రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించాలి..!
మహర్షి వాల్మీకి జయంతిని రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించాలి..!
- ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలల్లో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలి
- వాల్మీకి బోయ సంఘం ప్రతినిధులను ఆహ్వానించాలి
- రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గుజ్జుల గౌరీశ్వర నాయుడు
నందికొట్కూరు రూరల్ మేజర్ న్యూస్-: మహర్షి వాల్మీకి జయంతిని ఈ నెల 26వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ పాఠశాలలు, విద్యాసంస్థల్లో గౌరవప్రదంగా నిర్వహించేలా రాష్ట్ర ప్రభుత్వం తగిన ఆదేశాలు జారీ చేయాలని మహర్షి వాల్మీకి బోయ సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గుజ్జుల గౌరీశ్వర నాయుడు ప్రభుత్వాన్ని కోరారు. ఈ అంశంపై ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా ప్రభుత్వానికి వినతిపత్రం సమర్పించినట్లు తెలిపారు. జయంతి వేడుకలు కేవలం ఒక వర్గానికో, ఒక ప్రాంతానికో పరిమితం కాకుండా ప్రభుత్వం ఆధ్వర్యంలో అన్ని జిల్లాల్లో నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. జిల్లా కలెక్టర్లు, సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో వ్యవహరించి ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, ఇతర విద్యాసంస్థల్లో మహర్షి వాల్మీకి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. విద్యార్థులకు మహర్షి జీవిత విశేషాలు, రామాయణంలోని నీతి బోధనలు, సామాజిక సమానత్వం, మానవతా విలువలపై అవగాహన కల్పించే కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. అలాగే ఆయా ప్రాంతాల్లోని వాల్మీకి బోయ సంఘాల ప్రతినిధులు, పెద్దలు, సామాజిక సేవకులను అధికారిక కార్యక్రమాలకు గౌరవంగా ఆహ్వానించి, వారి భాగస్వామ్యంతో జయంతి వేడుకలను నిర్వహించాలని కోరారు. దీనివల్ల మహర్షి వాల్మీకి ఆశయాలు మరింత విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లడంతో పాటు సమాజంలో ఐక్యత, పరస్పర గౌరవం, సాంస్కృతిక చైతన్యం పెరుగుతాయని అభిప్రాయపడ్డారు. ఈ అంశంపై అక్టోబర్ 21న ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఎన్ ఎన్ డి లో 20261021693 గ్రీవెన్స్ నంబరుతో వినతిపత్రం నమోదు చేసినట్లు గుజ్జుల గౌరీశ్వర నాయుడు తెలిపారు. జయంతి తేదీ సమీపిస్తున్నందున రాష్ట్ర ప్రభుత్వం, సంబంధిత ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి అవసరమైన ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. మహర్షి వాల్మీకి జయంతి వేడుకలు గౌరవంగా జరగాలి.. ఆయన ఆశయాలు ప్రతి ఒక్కరికీ చేరాలి. ప్రభుత్వ కార్యాలయాల నుంచి పాఠశాలల వరకు జయంతి స్ఫూర్తి కనిపించాలి. స్థానిక వాల్మీకి బోయ సోదరులను భాగస్వాములను చేసి, అందరి సహకారంతో వేడుకలను విజయవంతం చేయాలని ఆయన కోరారు.