ఖైదీలలో పరివర్తనకు జైళ్లు సంస్కరణ కేంద్రాలుగా మారాలి -- కలెక్టర్ హిమాన్షు శుక్ల
విడుదల తర్వాత గౌరవంగా జీవించేలా నైపుణ్య శిక్షణ ఇవ్వాలి – జిల్లా ప్రధాన న్యాయమూర్తి నరసింహమూర్తి
నెల్లూరు కలెక్టరేట్, మేజర్ న్యూస్ : జైళ్లు కేవలం శిక్ష అనుభవించే ప్రదేశాలుగా కాకుండా ఖైదీలలో పరివర్తన తీసుకొచ్చే సంస్కరణ కేంద్రాలుగా ఉండాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి అక్కిరెడ్డి నరసింహమూర్తి, కలెక్టర్ హిమాన్షు శుక్ల అన్నారు. గాంధీ జయంతి సందర్భంగా వెంకటాచలం మండలం చెముడుగుంట సమీపంలోని జిల్లా కేంద్ర కారాగారంలో నిర్వహించిన ఖైదీల సంక్షేమ దినోత్సవం కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జైలు వివిధ విభాగాలను, ఖైదీలు తయారు చేస్తున్న ఉత్పత్తులను పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఎవరూ పుట్టుకతోనే నేరస్థులు కారని, సామాజిక, ఆర్థిక పరిస్థితులు, జీవితంలో ఎదురయ్యే పరిస్థితులు వ్యక్తులపై ప్రభావం చూపుతాయని అన్నారు. ఖైదీలలో సానుకూల మార్పు తీసుకొచ్చేందుకు అధికారులు కృషి చేయాలని సూచించారు. జైళ్లలో ఉన్న ఖైదీలకు వెల్డింగ్, ప్లంబింగ్, ఎలక్ట్రికల్ వంటి వృత్తి నైపుణ్యాల్లో శిక్షణ ఇవ్వాలని తెలిపారు. శిక్షణ పొందిన వారు విడుదలైన తర్వాత ఉపాధి పొందుతూ సమాజంలో గౌరవంగా జీవించేందుకు ఇది ఉపయోగపడుతుందని చెప్పారు. ఖైదీలు తయారు చేస్తున్న బెంచీలు, ఇతర ఉత్పత్తులను ప్రభుత్వ అవసరాలకు వినియోగించే అవకాశాలను పరిశీలిస్తామని తెలిపారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి నరసింహమూర్తి మాట్లాడుతూ మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఖైదీల సంక్షేమ దినోత్సవం నిర్వహించడం ద్వారా మానవత్వం, పరివర్తనపై అవగాహన పెంచుతున్నామని అన్నారు. “నేరాన్ని ద్వేషించండి.. నేరస్థుడిని ప్రేమించండి” అనే గాంధీజీ సందేశాన్ని గుర్తుచేశారు. ఖైదీలు గత తప్పులను సరిదిద్దుకుని మంచి మార్గంలో పయనించాలని సూచించారు. జైలులోనే విద్యను అభ్యసిస్తూ టెన్త్, ఇంటర్, డిగ్రీ పూర్తి చేస్తున్న ఖైదీలను ఆయన అభినందించారు. విడుదలైన తర్వాత స్వతంత్రంగా జీవించేందుకు విద్యతో పాటు వృత్తి నైపుణ్యాలను నేర్చుకోవాలని సూచించారు. ఖైదీలకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా ఉచిత న్యాయ సహాయం అందిస్తున్నట్లు తెలిపారు. అధికారులు క్రమం తప్పకుండా జైలును సందర్శించి ఖైదీల సమస్యలను తెలుసుకుని పరిష్కరించేందుకు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. అనంతరం ఇంటర్, డిగ్రీ పూర్తి చేసిన ఖైదీలకు ధ్రువపత్రాలు అందజేశారు. సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను అభినందించి బహుమతులు అందించారు. కార్యక్రమంలో ఏఎస్పీ సౌజన్య, జైలు డిప్యూటీ సూపరింటెండెంట్లు కమలాకర్, మహేశ్వరుడు, న్యాయశాఖ అధికారులు, జైలు సిబ్బంది, ఖైదీలు పాల్గొన్నారు.