ఎన్నికల ప్రక్రియపై పూర్తి అవగాహన ఉండాలి* • జిల్లా జనరల్ అబ్జర్వర్ బి. అనిల్ కుమార్ రెడ్డి, ఐఏఎస్
*ఎన్నికల ప్రక్రియపై పూర్తి అవగాహన ఉండాలి*
• జిల్లా జనరల్ అబ్జర్వర్ బి. అనిల్ కుమార్ రెడ్డి, ఐఏఎస్
ఎన్నికల నిర్వహణ ప్రక్రియ, బాధ్యతలపై సంబంధిత సిబ్బంది పూర్తి అవగాహన కలిగి ఉండాలని కర్నూలు జిల్లా జనరల్ అబ్జర్వర్ బి. అనిల్ కుమార్ రెడ్డి, ఐఏఎస్ అన్నారు. ఆదివారం ఆయన ప్రభుత్వ జూనియర్ కళాశాల (టౌన్)లో ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులకు నిర్వహిస్తున్న శిక్షణ తరగతులను, అలాగే వెంకటరమణ కాలనీలోని నగరపాలక సంస్థ కార్యాలయంలో మేయర్ స్థాన ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయం, ఇందిరాగాంధీ నగర్లోని 59, 60, 61 వార్డుల రిటర్నింగ్ అధికారి కార్యాలయాల్లో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియలను అడిషనల్ ఎలక్షన్ అథారిటీ, నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసుతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా బి. అనిల్ కుమార్ రెడ్డి, ఐఏఎస్ మాట్లాడుతూ.. ఎన్నికల ప్రక్రియపై ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు పూర్తి అవగాహన కలిగి ఉండాలని, ఎన్నికల విధులు, బాధ్యతలను ఎన్నికల సంఘం హ్యాండ్బుక్ మార్గదర్శకాల ప్రకారం సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. ఎన్నికల నిర్వహణలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని తెలిపారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి అధికారులకు అందించిన శిక్షణలో వివరించిన అంశాలను క్షుణ్ణంగా తెలుసుకోవాలని సూచించారు.
చల్లా ఓబులేసు మాట్లాడుతూ.. ఎన్నికల విధులను ఎన్నికల మార్గదర్శకాల ప్రకారం నిర్వహిస్తూ, పోలింగ్ ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. అథెనా స్కూల్లో బ్యాలెట్ బాక్సులను తీసుకొని, పోలింగ్ కేంద్రాల్లో ఉపయోగించి తిరిగి అప్పగించేంత వరకు ఎంతో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎన్నికల సామగ్రి వినియోగం, పోలింగ్ నిర్వహణ, ఎన్నికల విధివిధానాలపై పూర్తి అవగాహనతో బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని సూచించారు. ఎన్నికల నిర్వహణలో పారదర్శకతకు ప్రాధాన్యతనిస్తూ, ఎలాంటి పొరపాట్లకు అవకాశం లేకుండా సమన్వయంతో పనిచేయాలని పేర్కొన్నారు.
అంతకన్నా ముందు జిల్లా జనరల్ అబ్జర్వర్ బి. అనిల్ కుమార్ రెడ్డి, ఐఏఎస్ను రాష్ట్ర ప్రభుత్వ అతిథి గృహంలో కమిషనర్ చల్లా ఓబులేసు మర్యాదపూర్వకంగా పుష్పగుచ్చం అందించి, ఎన్నికల నిర్వహణ స్థితులపై చర్చించారు.
కార్యక్రమంలో మేయర్ స్థాన ఎన్నికల రిటర్నింగ్ అధికారి కె. వేణుగోపాల్, 59, 60, 61 వార్డుల రిటర్నింగ్ అధికారి ఐ.డి. శిరీష, తదితరులు పాల్గొన్నారు.