దుర్గాదేవి అలంకారంలో కనకదుర్గమ్మ దర్శనం
ఇంద్రకీలాద్రి, మేజర్ న్యూస్: ఇంద్రకీలాద్రిపై దుర్గాదేవి అలంకారంలో దర్శనమిస్తున్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని భక్తులు పెద్దఎత్తున దర్శించుకుంటున్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా దర్శన క్యూలైన్ల నిర్వహణ, భద్రత, తాగునీటి పంపిణీ, చిన్నారులకు పాలు, అన్నప్రసాద పంపిణీ, పారిశుధ్య నిర్వహణపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. భక్తుల రాకపోకలను క్రమబద్ధీకరించేందుకు పోలీసు సిబ్బంది నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. సీసీ కెమెరాలు, కమాండ్ కంట్రోల్ వ్యవస్థల ద్వారా పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, అత్యవసర పరిస్థితుల్లో తక్షణమే స్పందించేలా సిబ్బందిని అప్రమత్తం చేశారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ, దేవస్థానం కార్యనిర్వహణాధికారి వి.కె. శీనా నాయక్, పాలకమండలి ఛైర్మన్ బొర్రా గాంధీ, పోలీస్ కమిషనర్ ఎస్.వి. రాజశేఖరబాబు, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ హెచ్.ఎం. ధ్యానచంద్ర ఆధ్వర్యంలో వివిధ శాఖల అధికారులు సమన్వయంతో ఉత్సవాల నిర్వహణను పర్యవేక్షిస్తున్నారు.