|
|
by Suryaa Desk | Wed, Sep 10, 2025, 09:09 PM
జగిత్యాల జిల్లా రూరల్ మండలం కల్లెడ గ్రామంలో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. గణేష్ చందా ఇవ్వలేదన్న కోపంతో.. నాలుగు కుంటుంబాలను కుల బహిష్కరణ చేశారు. నలుగురు యువకులు, వారి కుటుంబాలను గ్రామ కుల పెద్దలు బహిష్కరించడం మానవ హక్కుల ఉల్లంఘనగా తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ ఘటన గ్రామాన్ని మాత్రమే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా దిగ్భ్రాంతికి గురి చేసింది.
వివరాల్లోకి వెళితే.. గ్రామంలో ఓ కులానికి చెందిన వారు చందాలతో గణపతి నవరాత్రి ఉత్సవాలు నిర్వహించారు. గణేష్ విగ్రహం నిమజ్జనం పూర్తయిన ఉత్సవాల నిర్వాహకులు, గ్రామ కుల పెద్దలు గాలిపెల్లి అరుణ్, గంగ లచ్చయ్య, అంజి, సూర్యవంశీలను ఒక్కొక్కరిని రూ.1,116 చందా ఇవ్వాలని డిమాండ్ చేశారు. అయితే ఆ మొత్తం చెల్లించలేదన్న కారణంతో వారిని కుల బహిష్కరణకు గురి చేశారు.
ఈ బహిష్కరణ నిర్ణయం ఇంతటితో ఆగలేదు. కుల పెద్దలు మరింత అమానుషంగా వ్యవహరించి గ్రామంలో ఎవరైనా బహిష్కృతులైన ఈ కుటుంబాలతో మాట్లాడినా, పలకరించినా లేదా ఏ రకంగానైనా సంప్రదించినా రబ.25 వేల జరిమానా విధిస్తామని బహిరంగంగా చాటింపు వేశారు. డబ్బు శబ్దాలతో ఈ హెచ్చరికను గ్రామమంతా ప్రచారం చేయించారు. ఇది పాతకాలపు నాటి అమానవీయ ఆచారాలను గుర్తు చేసింది. ఈ నియమం అక్షరాలా అమలు కావడంతో, బహిష్కరణకు గురైన కుటుంబాలు తీవ్రమైన సామాజిక ఒంటరితనాన్ని ఎదుర్కొంటున్నాయి.
ఈ ఘటన సాధారణ కుటుంబాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే ప్రశ్న ఇప్పుడు గ్రామంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. గ్రామ పెద్దల ఈ అసాధారణ నిర్ణయం మానవ హక్కులకు పూర్తిగా విరుద్ధంగా ఉందని, ఇది సమాజంలో నివసించే వారి భవిష్యత్తును అంధకారంలోకి నెడుతుందని సామాజిక కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ చర్యల వెనుక ఉన్న ఉద్దేశ్యం, వాటి చట్టబద్ధతపై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఆధునిక సమాజంలో ఇలాంటి అమానవీయ ఆచారాలు, కుల బహిష్కరణలు ఎంతవరకు సమంజసమని, వాటిని నియంత్రించడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై పెద్ద చర్చ ప్రారంభమైంది. సామాజిక న్యాయం, మానవ హక్కులు, సాంప్రదాయ ఆచారాల మధ్య ఉన్న విభేదాలను ఎత్తి చూపుతోంది. ఈ ఘటనపై అధికార యంత్రాంగం ఎలా స్పందిస్తుందోనని స్థానికులు ఎదురు చూస్తున్నారు.