విద్యార్థులను వంటమనుషులుగా మార్చిన ప్రిన్సిపాల్..!
నల్గొండ జిల్లా దామరచర్ల సాంఘిక సంక్షేమ గురుకుల (సోషల్ వెల్ఫేర్) హాస్టల్‌లో ప్రిన్సిపాల్, వార్డెన్లు కనీస మానవత్వం లేకుండా ప్రవర్తిస్తున్నారు. చదువుకోవడానికి వచ్చిన విద్యార్థులను పనిమనుషులుగా మార్చి వారిచేత వంట పనులు చేయిస్తుండటం తీవ్ర కలకలం రేపుతోంది.
హాస్టల్‌లో విద్యార్థులకు భోజనం తయారీ కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా వంట మనుషులను నియమించి, వారికి జీతాలు కూడా చెల్లిస్తోంది. అయినప్పటికీ, నిర్వాహకులు వారి పనిని విద్యార్థులపై రుద్దుతున్నారు. హాస్టల్ విద్యార్థులతో రోజూ బలవంతంగా చపాతీలు చేయిస్తూ రాక్షస ఆనందం పొందుతున్నారు.
భగ్గుమంటున్న విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు
విద్యార్థులతో వంట పనులు చేయిస్తున్న ఉదంతం బయటకు రావడంతో విద్యార్థి సంఘాలు, పిల్లల తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చదువు చెప్పాల్సిన గురువులే ఇలా పనులు చేయించడంపై భగ్గుమంటున్నారు. బాధ్యులైన ప్రిన్సిపాల్, వార్డెన్‌లను తక్షణమే సస్పెండ్ చేసి, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.