విద్యార్థినులను పనిమనుషులుగా మార్చిన హాస్టల్ సిబ్బంది!
నల్గొండ జిల్లాలోని తుంగపహాడ్ మోడల్ గర్ల్స్ హాస్టల్‌లో అక్రమాలు వెలుగు చూశాయి. చదువుకోవడానికి వచ్చిన విద్యార్థినుల చేత హాస్టల్ వార్డెన్, ఇతర సిబ్బంది బలవంతంగా వంట పనులు చేయిస్తుండటం కలకలం రేపుతోంది.
హాస్టల్‌లోని విద్యార్థినులకు భోజనం తయారు చేయడం కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా వంట సిబ్బందిని నియమించినప్పటికీ, వారు తమ బాధ్యతలను విస్మరించారు. హాస్టల్ వార్డెన్, సిబ్బంది కలిసి రోజూ విద్యార్థినులతోనే చపాతీలు, ఇతర వంట పనులు చేయిస్తున్నారు.
ఆగ్రహం వ్యక్తం చేస్తున్న తల్లిదండ్రులు
పాఠశాలలో విద్యపై దృష్టి పెట్టాల్సిన పిల్లలతో ఇలా కష్టమైన వంట పనులు చేయించడంపై విద్యార్థినుల తల్లిదండ్రులు, స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీస మానవత్వం లేకుండా ప్రవర్తిస్తున్న వార్డెన్, సంబంధిత సిబ్బందిపై తక్షణమే అధికారులు విచారణ జరిపి, కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.