ఆసుపత్రిలో వెంటిలేటర్ పేలి ముగ్గురు పసికందులు మృతి!
మహారాష్ట్రలోని అమరావతి ప్రభుత్వ ఆసుపత్రిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. నవజాత శిశువుల వార్డులోని ఒక వెంటిలేటర్ అకస్మాత్తుగా పేలిపోవడంతో ముగ్గురు పసికందులు ప్రాణాలు కోల్పోయారు.
ఆసుపత్రిలోని పసిపిల్లల నియోనాటల్ కేర్ యూనిట్‌లో సిబ్బంది విధుల్లో ఉండగా ఊహించని విధంగా వెంటిలేటర్ పేలి మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదం జరిగిన సమయంలో వార్డులో మొత్తం 39 మంది చిన్నారులు చికిత్స పొందుతున్నారు.
మంటలను గమనించిన ఆసుపత్రి సిబ్బంది వెంటనే స్పందించి 36 మంది చిన్నారులను సమయస్ఫూర్తితో సురక్షిత ప్రాంతాలకు తరలించి ప్రాణాలు కాపాడారు. అయితే, ప్రాణాలతో బయటపడ్డ వారిలో ఆరుగురు చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి. వారికి ప్రస్తుతం అత్యవసర చికిత్స అందిస్తున్నారు.
ఈ దారుణ ఘటనపై స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తుండగా, అధికారులు ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర విచారణకు ఆదేశించారు.