తిరుపతి డ్రోన్ ప్రమాదంలో ఏపీ హోం మంత్రి అనితకు స్వల్ప గాయం
తిరుపతిలో నిర్వహించిన 'అమరావతి ఛాంపియన్‌షిప్' ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఊహించని ప్రమాదం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి వంగలపూడి అనితకు స్వల్ప గాయమైంది.
కార్యక్రమ ప్రారంభోత్సవ సమయంలో ప్రదర్శన కోసం ఆకాశంలో డ్రోన్‌ను ఎగురవేశారు. అయితే, ఆ సమయంలో డ్రోన్ బ్యాటరీ ఛార్జింగ్ ఒక్కసారిగా తగ్గిపోవడంతో కంట్రోల్ తప్పి నేరుగా కిందపడిపోయింది. డ్రోన్ కిందకు పడుతున్న సమయంలో అక్కడే నిలబడి ఉన్న హోం మంత్రి అనిత చేతికి అది బలంగా తగలడంతో ఆమెకు స్వల్ప గాయమైంది.
వెంటనే స్పందించిన సిబ్బంది ఆమెకు ప్రథమ చికిత్స అందించారు. గాయం తీవ్రమైనది కాకపోవడంతో అధికారులు, పార్టీ శ్రేణులు ఉపశమనం పొందారు.