అమిత్ షాతో అస్సాం సిఎం భేటీ
అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. ఈ భేటీలో రాష్ట్రంలో సంభవించిన వరదలు, వాటివల్ల జరిగిన నష్టం మరియు సహాయక చర్యలపై ఇరువురూ సుదీర్ఘంగా చర్చించారు. అస్సాంలో ఇటీవలి వరదల కారణంగా జరిగిన ఆస్తి, ప్రాణ నష్టం తీవ్రతను ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ కేంద్ర హోం మంత్రికి వివరించారు.
వరద ప్రభావిత ప్రాంతాల్లో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న తక్షణ సహాయక, పునరావాస మరియు పునరుద్ధరణ చర్యల గురించి తెలియజేశారు. వరద నష్టం తీవ్రతపై స్పందించిన అమిత్ షా, బాధితులకు పునరావాసం కల్పించడంతో పాటు పునరుద్ధరణ పనులకు కేంద్ర ప్రభుత్వం తరఫున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.
వరద సంక్షోభ సమయంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా నిరంతరం రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతూ పరిస్థితిని సమీక్షించారని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి తెలిపారు.