ఆయిల్‌పామ్ సాగుపై రైతులకు క్షేత్రస్థాయి అవగాహన.
ఆయిల్‌పామ్ సాగుపై రైతులకు క్షేత్రస్థాయి అవగాహన.
ఖమ్మం జిల్లాలోని ఆయిల్‌పామ్ తోటలను సందర్శించిన సంగారెడ్డి జిల్లా రైతులు
సంగారెడ్డి, :-జాతీయ ఆయిల్‌పామ్ మిషన్ లో భాగంగా ఆయిల్‌పామ్ సాగుపై రైతులకు క్షేత్రస్థాయి అవగాహన కల్పించేందుకు జిల్లా ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో విజ్ఞాన యాత్రను నిర్వహించారు.సంగారెడ్డి జిల్లాలోని వివిధ మండలాలకు చెందిన 30 మంది ఆయిల్‌పామ్ సాగుపై ఆసక్తి ఉన్న రైతులను గోద్రెజ్ ఆగ్రోవెట్ సంస్థ సహకారంతో ఖమ్మం జిల్లా కొనిజర్ల మండలంలోని ఆయిల్‌పామ్ తోటల సందర్శనకు తీసుకెళ్లారు.విజ్ఞాన యాత్రలో భాగంగా రైతులు ఆయిల్‌పామ్ తోటలను ప్రత్యక్షంగా సందర్శించి సాగు విధానాలు, మొక్కల పెంపకం, తోటల నిర్వహణ, ఎరువుల యాజమాన్యం, నీటి యాజమాన్య పద్ధతులు, పంట దిగుబడులు, ప్రాసెసింగ్, మార్కెటింగ్ తదితర అంశాలను క్షేత్రస్థాయిలో తెలుసుకున్నారు.ఆయిల్‌పామ్ సాగు చేస్తున్న రైతులతో ముఖాముఖిగా మాట్లాడి, వారు అనుసరిస్తున్న సాగు పద్ధతులు, పంట ద్వారా పొందుతున్న ఆర్థిక ప్రయోజనాలు, ఎదుర్కొంటున్న సమస్యలు, అనుభవాలను తెలుసుకునే అవకాశం కల్పించారు.అదనపు కలెక్టర్ సంగీత జెండా ఊపి విజ్ఞాన యాత్రను ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఆయిల్‌పామ్ దీర్ఘకాలికంగా రైతులకు మంచి ఆదాయాన్ని అందించే పంటగా నిలిచే అవకాశం ఉందన్నారు. ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలు, సాంకేతిక సహకారాన్ని సద్వినియోగం చేసుకొని రైతులు ఆయిల్‌పామ్ సాగును విస్తరించాలని సూచించారు. శాస్త్రీయ పద్ధతుల్లో సాగు చేపట్టడం ద్వారా ఉత్పాదకతను పెంచుకోవడంతో పాటు, రైతులు మెరుగైన ఆదాయం పొందేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు.రైతులు ఇతర ప్రాంతాల్లో విజయవంతంగా సాగు చేస్తున్న ఆయిల్‌పామ్ తోటలను ప్రత్యక్షంగా పరిశీలించడం ద్వారా పంటపై మరింత అవగాహన పొందడంతో పాటు, తమ ప్రాంతంలో సాగు చేపట్టేందుకు అవసరమైన సాంకేతిక అంశాలను తెలుసుకునే అవకాశం లభించిందని జిల్లా ఉద్యాన అధికారి తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యాన అధికారి సోమేశ్వరరావు, ఉద్యాన శాఖ అధికారులు, ఆయిల్‌పామ్ సాగుపై ఆసక్తి ఉన్న రైతులు, గోద్రెజ్ ఆగ్రోవెట్ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.