కాంగ్రెస్ 1000 రోజుల పాలనపై బీఆర్‌ఎస్ ఛార్జ్‌షీట్: హరీశ్ రావు తీవ్ర ధ్వజం
హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను, అరాచక పాలనను ఎండగడుతూ ప్రజల ముందుకు ‘ఛార్జ్ షీట్’ తీసుకొచ్చినట్లు మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు తెలిపారు. పాలనాపరంగా వ్యవస్థలను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసిందని ఆయన ఆరోపించారు. ఈ సందర్భంగా మాట్లాడిన హరీశ్ రావు కాంగ్రెస్ పాలనపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
ఆరు గ్యారంటీల పేరుతో బాండ్ పేపర్లు రాసిచ్చి, 1000 రోజులు గడుస్తున్నా ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. కేసీఆర్ అభివృద్ధి చేసిన రాష్ట్రాన్ని రేవంత్ రెడ్డి ముందుకు తీసుకెళ్లాల్సింది పోయి, పూర్తిగా నాశనం చేసి కుప్పకూల్చారు.
పురోగమనం వైపు వేగంగా ప్రయాణించాల్సిన తెలంగాణ రాష్ట్రం, ఈ ప్రభుత్వ చేతకానితనం వల్ల తిరోగమనం వైపు పయనిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వ అరాచకాలను, ఇచ్చిన హామీల విస్మరణను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్తామని ఈ ఛార్జ్ షీట్ విడుదల సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.