గ్రీన్ కార్డు విధానంలో సమూల మార్పులకు అమెరికా సరికొత్త బిల్లు: భారతీయ ఐటీ నిపుణులపై తీవ్ర ప్రభావం
సూర్య అంతర్జాతీయ డెస్క్: అమెరికాలో శాశ్వత నివాస హోదా (గ్రీన్ కార్డు) కోసం ఏళ్ల తరబడి నిరీక్షిస్తున్న లక్షలాది మంది భారతీయ నిపుణుల భవిష్యత్తును తీవ్రంగా ప్రభావితం చేసే సరికొత్త ఇమిగ్రేషన్ బిల్లు యూఎస్ చట్టసభల్లో తెరపైకి వచ్చింది. అలబామాకు చెందిన రిపబ్లికన్ సెనేటర్ టామీ ట్యూబర్‌విల్లే 'అమెరికన్స్ ఫస్ట్ ఇమిగ్రేషన్ యాక్ట్' పేరిట ఈ వివాదాస్పద బిల్లును సెనేట్‌లో ప్రవేశపెట్టారు. ప్రస్తుత ఎంప్లాయ్‌మెంట్ ఆధారిత గ్రీన్ కార్డు కేటగిరీల (ఈబీ-1, ఈబీ-2, ఈబీ-3 తదితర) స్థానంలో మెరిట్ ఆధారిత పాయింట్ల వ్యవస్థను తీసుకురావాలని ఈ ప్రతిపాదన నిర్దేశిస్తోంది. అంతేకాకుండా నూతన వ్యవస్థ అమలులోకి రాగానే ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న పాత ఎంప్లాయ్‌మెంట్ పిటిషన్లను రద్దు చేయడం లేదా తిరస్కరించడం జరుగుతుందని బిల్లు నిబంధనల్లో పేర్కొనడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
ఈ ప్రతిపాదిత బిల్లు ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఏటా గరిష్టంగా 1,92,000 పాయింట్స్ ఆధారిత ఇమిగ్రెంట్ వీసాలను కేటాయిస్తారు. దరఖాస్తుదారులు ఉద్యోగ ఆఫర్‌తో పాటు కనీసం 16 పాయింట్లను సాధించాల్సి ఉంటుంది. వేతనం, విద్యా అర్హతలు, ఆంగ్ల భాషా ప్రావీణ్యం, సైనిక సేవ మరియు విశిష్ట విజయాల ఆధారంగా పాయింట్లు కేటాయిస్తూ, అత్యధిక స్కోరు సాధించిన వారికే ప్రాధాన్యత ఇస్తారు. అమెరికన్ డిగ్రీ లేని దరఖాస్తుదారులు స్థానిక సగటు వేతనం కంటే కనీసం 200 శాతం, అమెరికన్ డిగ్రీ ఉన్నవారు కనీసం 150 శాతం వేతనం పొందే ఆఫర్ కలిగి ఉండాలి. అంతేకాకుండా సంస్థలు మొదట అమెరికన్ పౌరులకే ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, విదేశీయులను నియమించుకోవడానికి ముందు సమాన అర్హతలున్న అమెరికన్ వర్కర్లను తొలగించరాదని స్పష్టమైన షరతులు విధించారు.
నూతన విధానంలో జారీ చేసే గ్రీన్ కార్డులు ప్రారంభంలో రెండేళ్లపాటు షరతులతో కూడి (కండిషనల్) ఉంటాయి. దరఖాస్తుదారు నిర్దేశిత ఉద్యోగంలో కొనసాగకపోయినా లేదా ప్రభుత్వ సంక్షేమ ప్రయోజనాలు పొందినా వారి కుటుంబ సభ్యుల శాశ్వత నివాస హోదా రద్దవుతుంది. డైవర్సిటీ వీసా లాటరీని రద్దు చేయడంతో పాటు, పౌరుల తల్లిదండ్రులు మరియు తోబుట్టువుల ఆధారిత ఫ్యామిలీ గ్రీన్ కార్డులను ఈ బిల్లు పూర్తిగా తొలగిస్తుంది. ఇప్పటికే గ్రీన్ కార్డుల కోసం దశాబ్దాలుగా వెయిటింగ్ లిస్టులో ఉన్న వేలాది మంది భారతీయ హెచ్-1బీ వీసాదారుల దరఖాస్తుల స్థితిపై ఈ బిల్లు తీవ్ర సందిగ్ధతను రేపుతోంది. అయితే ఈ బిల్లు చట్టంగా మారాలంటే కాంగ్రెస్ ఉభయ సభల ఆమోదం పొందాల్సి ఉన్నందున దీని సాధ్యాసాధ్యాలపై విస్తృత చర్చ జరుగుతోంది.