ఉద్యోగ విపణిపై నెమ్మదిగా విరుచుకుపడుతున్న సునామీ: 40 శాతం కొలువులను ఏఐ మార్చేస్తుందని ఐఎంఎఫ్ హెచ్చరిక!
సూర్య అంతర్జాతీయ డెస్క్: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) విస్తరణ ప్రపంచ ఉద్యోగ విపణిపై పెను ప్రభావాన్ని చూపుతోందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) సంచలన నివేదికను విడుదల చేసింది. రాబోయే కాలంలో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 40 శాతం ఉద్యోగాలను ఏఐ సమూలంగా మార్చివేయడం, వాటి ప్రాధాన్యతను తగ్గించడం లేదా పూర్తిగా తుడిచిపెట్టే ప్రమాదం ఉందని సంస్థ అంచనా వేసింది. ఉద్యోగాలు, ఆర్థిక వృద్ధి మరియు ప్రభుత్వాల పన్ను ఆదాయాలపై తీవ్ర ప్రభావం చూపే ఈ పరిణామాన్ని 'నెమ్మదిగా ముంచుకొస్తున్న సునామీ'గా (స్లో మూవింగ్ సునామీ) ఐఎంఎఫ్ అభివర్ణించింది.
అమెరికాలో నిర్వహించిన ప్రాథమిక అధ్యయనం ప్రకారం, ఇప్పటికే దాదాపు 10 శాతం ఉద్యోగాలకు ఏఐ నైపుణ్యాలు తప్పనిసరిగా మారాయని నివేదిక స్పష్టం చేసింది. ప్రతిరోజూ ఒకే తరహాలో సాగే రొటీన్, పునరావృత విధులకు సంబంధించిన ఉద్యోగాల సంఖ్య వేగంగా తగ్గుముఖం పడుతోంది. అదే సమయంలో నిర్మాణం (కన్‌స్ట్రక్షన్), డేటా సెంటర్ల విభాగాల్లో తక్కువ వేతనం లభించే కార్మిక ఉద్యోగాల వృద్ధి మాత్రమే ఎక్కువగా కనిపిస్తోందని విశ్లేషించింది.
కృత్రిమ మేధస్సు వల్ల సంభవిస్తున్న ఈ భారీ మార్పుల కారణంగా భవిష్యత్తులో ఉద్యోగాల భద్రతతో పాటు దేశాల ఆర్థిక వ్యవస్థలలో అసమానతలు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కార్పొరేట్ సంస్థలు ఖర్చులను తగ్గించుకునేందుకు ఏఐ టూల్స్‌ను విస్తృతంగా అవలంబిస్తుండటంతో శ్రామిక శక్తి తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ఈ పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రభుత్వాలు సమగ్ర కార్మిక విధానాలను రూపొందించడంతో పాటు, యువతకు భవిష్యత్ అవసరాలకు తగిన అధునాతన సాంకేతిక శిక్షణను అందించాలని నిపుణులు సూచిస్తున్నారు.