యూత్, ఫ్యామిలీ ఆడియెన్స్‌ను అలరించే కంప్లీట్ ఎంటర్‌టైనర్ ‘రోమాంచకం’ – ప్రొడ్యూసర్ ప్రణయ్ రెడ్డి వంగా
బ్లాక్‌బస్టర్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సమర్పణలో భద్రకాళీ పిక్చర్స్ బ్యానర్‌పై రూపొందుతున్న యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ‘రోమాంచకం’. సుమంత్ ప్రభాస్, అనంతిక సనిల్ కుమార్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ప్రణయ్ రెడ్డి వంగా నిర్మిస్తుండగా, వేణుగోపాల్ రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ప్రేమ, హాస్యం, సస్పెన్స్, థ్రిల్ వంటి అంశాలను మేళవిస్తూ రూపొందిన ఈ సినిమా సెప్టెంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా నిర్మాత ప్రణయ్ రెడ్డి వంగా మీడియాతో మాట్లాడుతూ సినిమా విశేషాలను పంచుకున్నారు.
మేము సినిమాలను ఒక ప్రొడక్షన్ హౌస్‌గా నిరంతరం ప్రాజెక్ట్స్ చేస్తూ వెళ్లాలనే ఆలోచనతో ఉండం. గతంలో చాలా కథలు విన్నప్పటికీ, మా ఆలోచనా విధానానికి, అభిరుచులకు సరిపడే కథలు అనిపించకపోవడంతో వాటిని పక్కన పెట్టాం. ‘రోమాంచకం’ కథలో హ్యూమర్‌తో పాటు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, స్నేహితుల మధ్య చోటుచేసుకునే సరదా సంఘటనలు ఉన్నాయి. కథ విన్నప్పుడు ఇది మనకు నచ్చిన సినిమా అవుతుందనే నమ్మకం కలిగింది. అందుకే ఈ ప్రాజెక్ట్‌ను టేకప్ చేశాం. దర్శకుడు వేణుగోపాల్ రెడ్డితో మాకు మూడు, నాలుగేళ్లుగా పరిచయం ఉంది. ఆయన కథ చెప్పిన విధానం, స్క్రిప్ట్‌పై ఉన్న క్లారిటీ మమ్మల్ని బాగా ఇంప్రెస్ చేశాయి. కథపై నమ్మకం కలగడంతో ఆయనకు ఈ సినిమాను తెరకెక్కించే అవకాశం ఇచ్చాం.
సందీప్ రెడ్డి వంగా, వేణుగోపాల్ రెడ్డి ఇద్దరి ఫిల్మ్‌మేకింగ్ స్టైల్‌లో చాలా తేడా ఉంటుంది. అయితే వేణు చెప్పిన కథలో మాకు కనెక్ట్ అయ్యే ఒక ప్రత్యేకమైన కామన్ గ్రౌండ్ కనిపించింది. కథను కేవలం వినడం మాత్రమే కాకుండా, ఒక సన్నివేశాన్ని షూట్ చేసి చూపించమని వేణును అడిగాం. ఆయన ఆ సీన్‌ను అద్భుతంగా తెరకెక్కించాడు. ఆ సన్నివేశం అవుట్‌పుట్ చూసిన తర్వాత సినిమాను కూడా చాలా బాగా హ్యాండిల్ చేయగలడనే నమ్మకం మాలో ఏర్పడింది. ‘రోమాంచకం’ ప్రధానంగా క్యారెక్టర్ డ్రివెన్ కథ. సుమంత్ ప్రభాస్ పోషించిన పాత్ర చుట్టూనే కథ ముందుకు సాగుతుంది. ఇంజినీరింగ్ పూర్తి చేసి బయటకు వచ్చిన ఒక యువకుడి జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి, అతని ప్రేమకథ ఎలా సాగింది, స్నేహితుల మధ్య ఎదురయ్యే పరిస్థితులు, వారి కన్ఫ్యూజన్స్ ఎలాంటి ఫన్‌ను క్రియేట్ చేశాయనే అంశాలను దర్శకుడు ఆసక్తికరంగా తెరకెక్కించారు. దాదాపు 2 గంటల 20 నిమిషాల నిడివి ఉన్నప్పటికీ సినిమా చాలా జోవియల్‌గా, ఫాస్ట్ పేస్‌లో సాగుతుంది. ప్రేక్షకులకు సమయం తెలియకుండా ఎంజాయ్ చేసేలా ఉంటుంది. ఎక్కడా బోర్ కొట్టకుండా ఎంటర్‌టైన్‌మెంట్ అందించడమే మా ఉద్దేశం.
సంగీతం కూడా ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. వాసుకి తన మ్యూజిక్‌తో కథలోని ఎమోషన్స్‌ను, ఫీల్‌ను చక్కగా బ్లెండ్ చేశాడు. పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు మంచి ప్లస్ అవుతాయి. మా బ్యానర్ నుంచి వచ్చిన సినిమాలకు మ్యూజిక్ ఎప్పుడూ మంచి పేరు తీసుకొచ్చింది. ‘రోమాంచకం’ విషయంలో కూడా అదే తరహాలో ఆడియెన్స్‌ను ఆకట్టుకునే మ్యూజికల్ కంటెంట్ ఉంటుంది. ఈ ప్రాజెక్ట్‌ను ఓకే చేసిన తర్వాత సందీప్ రెడ్డి వంగా సినిమా మేకింగ్‌లో ఎలాంటి జోక్యం చేసుకోలేదు. ప్రస్తుతం ఆయన ‘స్పిరిట్’ పనుల్లో బిజీగా ఉన్నారు. సినిమా పూర్తయిన తర్వాత ఫస్ట్ కట్ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మా సినిమాకు సెన్సార్ నుంచి ‘U’ సర్టిఫికెట్ లభించింది. దీంతో యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా థియేటర్లలో సినిమాను ఎంజాయ్ చేయవచ్చు.
నాకు వ్యక్తిగతంగా కామెడీ సినిమాలంటే చాలా ఇష్టం. సినిమా బాగా నచ్చితే ఒకసారి చూసి వదిలేయకుండా మళ్లీ మళ్లీ చూసే అలవాటు ఉంది. ‘రోమాంచకం’లో కూడా కామెడీని ప్రత్యేకంగా రాసి పెట్టినట్లు కాకుండా కథలో భాగంగా సహజంగా వచ్చేలా దర్శకుడు డిజైన్ చేశారు. సినిమాలోని నాలుగు ప్రధాన పాత్రల మధ్య జరిగే సంఘటనలను వేణుగోపాల్ రెడ్డి చాలా నేచురల్‌గా క్యాప్చర్ చేశాడు. ఎక్కడా కామెడీ కోసం సన్నివేశాలను బలవంతంగా ఇరికించలేదు. అందుకే సినిమా అంతా ఆర్గానిక్‌గా, రియలిస్టిక్‌గా అనిపిస్తూ ప్రేక్షకులను నవ్విస్తుంది. వేణుగోపాల్ ప్రొడ్యూసర్స్ ఫ్రెండ్లీ డైరెక్టర్. సినిమా కోసం మరింత బడ్జెట్ ఇస్తామని మేము చెప్పినా, తనకు అవసరమైనంత మాత్రమే తీసుకుని సినిమాను పూర్తి చేశాడు. నిర్మాతలపై భారం పడకుండా ప్రాజెక్ట్‌ను ప్లాన్ చేయడం ఆయన ప్రత్యేకత.
సెన్సార్ విధానాల విషయానికి వస్తే అమెరికాలో సెన్సార్ వ్యవస్థ ప్రధానంగా ఇండస్ట్రీ ఆధారంగా కొనసాగుతుండగా, మన దేశంలో అది ప్రభుత్వ పరిధిలో ఉంటుంది. మన దేశ సంస్కృతి, సంప్రదాయాలు, ప్రజల విశ్వాసాలు వంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని ఇక్కడ కొన్ని నిబంధనలు అమలులో ఉన్నాయి. ప్రభుత్వ పరంగా చూస్తే ఆ నిబంధనలకు ఒక కారణం ఉంటుంది. ఫిల్మ్‌మేకర్స్‌కు ఆ రూల్స్‌పై ముందుగానే అవగాహన ఉంటే, కథను, సన్నివేశాలను రూపొందించే సమయంలో అవసరమైన జాగ్రత్తలు తీసుకోవచ్చు. కాలానుగుణంగా సెన్సార్ నిబంధనలు కూడా మారుతూ, అప్‌డేట్ అవుతూ ఉంటాయి.
ఈ సినిమాలో హీరో సుమంత్ ప్రభాస్, హీరోయిన్ అనంతిక సనిల్ కుమార్ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. వారితో పాటు ఫ్రెండ్స్ పాత్రల్లో నటించినవారు, ఇతర కీలక పాత్రలు పోషించిన నటీనటులు కూడా తమ పెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకుంటారు. ఈ ప్రాజెక్ట్‌లో పనిచేసిన టెక్నీషియన్స్‌లో చాలామంది కొత్తవాళ్లే అయినప్పటికీ, అందరూ ఎంతో ప్యాషన్‌తో పనిచేశారు. హైదరాబాద్, చెన్నైలో షూటింగ్ నిర్వహించాం. కథ ప్రధానంగా హైదరాబాద్ నేపథ్యంలో సాగుతుంది. అయితే సినిమాలో ఉపయోగించిన భాష, స్లాంగ్ అందరికీ సులభంగా అర్థమయ్యేలా, మనం సాధారణంగా మాట్లాడుకునే విధంగానే ఉంటుంది. అందువల్ల ప్రతి ప్రాంతానికి చెందిన ప్రేక్షకులు కూడా కథతో కనెక్ట్ అవుతారని భావిస్తున్నాం.
సందీప్ రెడ్డి వంగా ఎప్పుడూ తన సినిమాల పనుల్లో బిజీగా ఉంటారు. ‘యానిమల్’ విడుదల తర్వాత కొంత రిలాక్స్ అయ్యే సమయం దొరికింది. ప్రస్తుతం మరో రెండు కథలు విన్నప్పటికీ అవి ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నాయి. మా పూర్తి ఫోకస్ ప్రస్తుతం ‘స్పిరిట్’పైనే ఉంది. ఆ సినిమా పూర్తయిన తర్వాత కొత్త ప్రాజెక్ట్స్ గురించి నిర్ణయం తీసుకుంటాం. వచ్చే ఏడాది ‘అర్జున్ రెడ్డి’ విడుదలై పదేళ్లు పూర్తవుతుంది. ఆ సందర్భంగా సినిమాలో కొన్ని కొత్త సీన్స్‌ను జోడించి రీ-రిలీజ్ చేసే ఆలోచన ఉంది. టీ-సిరీస్‌తో మా అనుబంధం చాలా బాగుంది. వారు చాలా మంచి వ్యక్తులు. మా మీద వారికి నమ్మకం ఉంది, మా కొలాబరేషన్ కూడా విజయవంతంగా కొనసాగుతోంది. ‘స్పిరిట్’ షూటింగ్ ఇప్పటికే దాదాపు 40 శాతం పూర్తయింది. ప్రభాస్ గారు సుమారు 40 రోజుల పాటు షూటింగ్‌లో పాల్గొన్నారు. మంచి కథలు దొరికితే భవిష్యత్తులో చిన్న చిత్రాలను కూడా నిర్మించేందుకు మేము ఎప్పుడూ సిద్ధంగా ఉంటాం.