ఓటీటీలోకి బ్లాక్‌బస్టర్ మూవీ 'DC'.. ఐదు భాషల్లో స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: థియేటర్లలో సూపర్ హిట్ విజయ సాధించిన క్రైమ్ అండ్ ఎమోషనల్ డ్రామా 'DC' (డిసి) డిజిటల్ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. ప్రముఖ దర్శకుడు అరుణ్ మాథేశ్వరన్ అత్యంత ఆసక్తికరంగా తెరకెక్కించిన ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ సోనీ లివ్‌లో విడుదల కానుంది. అక్టోబర్ 16వ తేదీ నుంచి ఈ సినిమా ప్రసారం కానున్నట్లు అధికారికంగా ప్రకటించారు. సౌత్ తో పాటు నార్త్ డిజిటల్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా తెలుగు, తమిళం, హిందీ, మలయాళం మరియు కన్నడ భాషల్లో ఐదు భాషలలో ఒకేసారి డిజిటల్ ప్రసారానికి అందుబాటులోకి తీసుకువస్తున్నారు.
ప్రముఖ దర్శకుడు లోకేశ్ కనగరాజ్ దేవదాస్ అలియాస్ దాస్ అనే విభిన్నమైన పాత్రలో నటించిన ఈ చిత్రం థియేటర్లలో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. తనకంటూ కొన్ని నిర్దిష్టమైన నియమాలు పెట్టుకుని జీవించే దాస్ జీవితంలోకి పార్వతి అనే గాయని అడుగుపెట్టడంతో కథలో అనూహ్యమైన మార్పులు చోటుచేసుకుంటాయి. మరోవైపు క్లిష్ట పరిస్థితులకు ఎదురొడ్డి తన జీవితాన్ని ముందుకు నడిపించేందుకు ప్రయత్నించే చంద్ర పాత్రలో వామికా గబ్బి అద్భుతమైన నటనను కనబరిచారు. ఈ ముగ్గురి జీవితాల చుట్టూ తిరిగే కథాంశం ప్రేక్షకుల్లో ఉత్కంఠను రేకెత్తిస్తుంది.
అధికారం, నమ్మకం, ప్రేమ మరియు ప్రతీకారం మధ్య సాగే సస్పెన్స్ కథాంశంతో అరుణ్ మాథేశ్వరన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రంలో సంజన కృష్ణమూర్తి, కస్తూరి రాజా, తలైవాసల్ విజయ్ తదితరులు కీలక పాత్రలలో నటించి తమ నటనతో మెప్పించారు. బిగ్ స్క్రీన్ పై మంచి విజయం సాధించిన ఈ చిత్రం డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై కూడా అదే స్థాయిలో ఆకట్టుకుంటుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
క్రైమ్ థ్రిల్లర్ మరియు ఎమోషనల్ డ్రామాలను ఇష్టపడే సినీ ప్రియులు ఈ చిత్రాన్ని వీక్షించేందుకు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. థియేటర్లలో మిస్ అయిన వారికి అక్టోబర్ 16 నుంచి ఇంటి వద్దనే ఐదు భాషల్లో వీక్షించే అవకాశం లభించనుంది. డిజిటల్ వేదికగా ప్రసారం కానున్న ఈ సినిమా ఓటీటీ ప్రేక్షకులను ఏ స్థాయిలో అలరిస్తుందో వేచి చూడాలి.
Also Read: నేచురల్ స్టార్ నానితో క్లాసిక్ లవ్ డ్రామా.. ఆఫర్ దక్కించుకున్న క్రేజీ హీరోయిన్ రుక్మిణి వసంత్!