ఫుడ్ డెలివరీ మార్కెట్‌లోకి ఫ్లిప్‌కార్ట్ ఎంట్రీ: స్విగ్గీ, జొమాటోలకు గట్టి పోటీ
దేశీయ ఈ కామర్స్ దిగ్గజం ఫుడ్ డెలివరీ రంగానికి విస్తరించేందుకు వేగంగా పావులు కదుపుతోంది. ఇప్పటివరకు ఆన్‌లైన్ షాపింగ్ మరియు క్విక్ కామర్స్‌లో దూసుకుపోతున్న ఫ్లిప్‌కార్ట్, ఇప్పుడు ఏకంగా ఆహార పంపిణీ రంగంలోకి అడుగుపెడుతోంది. ఇప్పటికే మార్కెట్లో తిరుగులేని ఆధిపత్యం చెలాయిస్తున్న స్విగ్గీ, జొమాటో వంటి దిగ్గజాలకు గట్టి పోటీనిచ్చేందుకు ఈ సంస్థ సన్నద్ధమవుతోంది.
తాజా సమాచారం ప్రకారం, 'ఈట్-ఇన్' (Eat-In) అనే సరికొత్త పేరుతో ఫ్లిప్‌కార్ట్ ఈ ఫుడ్ డెలివరీ సేవలను ప్రారంభించనుంది. ఇందులో భాగంగా సెప్టెంబర్ 15 నుండి బెంగళూరులోని తమ సొంత ఉద్యోగుల మధ్య ఈ సేవలకు సంబంధించి ట్రయల్స్ నిర్వహించాలని నిర్ణయించింది. ఉద్యోగుల మధ్య జరిగే ఈ ప్రయోగాత్మక పరీక్ష విజయవంతమైతే, రాబోయే రోజుల్లో ఇతర ప్రధాన నగరాలకు కూడా ఈ సేవలను విస్తరించే ప్రణాళికతో మేకర్స్ ఉన్నారు.
ఇప్పటికే బైక్ ట్యాక్సీ సేవలు అందించే 'ర్యాపిడో' సంస్థ 'ఆన్' (ONN) పేరుతో ఫుడ్ డెలివరీ మార్కెట్‌లోకి వచ్చి సంచలనం సృష్టించింది. ముఖ్యంగా జీరో కమిషన్ మోడల్‌తో దూసుకెళ్తున్న ఆ ప్లాట్‌ఫామ్ ఇటీవల రోజుకు 50 వేల ఆర్డర్ల మైలురాయిని దాటింది. ఈ నేపథ్యంలో ఈ-కామర్స్ దిగ్గజమైన ఫ్లిప్‌కార్ట్ కూడా రంగప్రవేశం చేస్తుండటంతో, రాబోయే కాలంలో ఫుడ్ డెలివరీ రంగంలో పోటీ మరింత తీవ్రతరమవడం ఖాయంగా కనిపిస్తోంది.