వర్షాలు సమృద్ధిగా కురిసి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి - వరుణ యాగం పూర్ణహుతిలో గద్దె అనురాధ
కృష్ణలంక, మేజర్ న్యూస్ : రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు పండాలని, రైతులు సంతోషంగా ఉండాలని ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గద్దె అనురాధ ఆకాంక్షించారు. మంగళవారం విజయవాడ కృష్ణలంక స్టాండ్ వద్ద గల కాళీమాత అమ్మవారి దేవస్థానంలో రాష్ట్రానికి సమృద్ధిగా వర్షాలు కురిసి, జలవనరులు నిండిపోవాలని ఆకాంక్షిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో, ఆలయ కమిటీ నేతృత్వంలో వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య భక్తిశ్రద్ధలతో నిర్వహించిన వరుణ యాగం పూర్ణహుతి కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గద్దె అనురాధ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గద్దె అనురాధ మాట్లాడుతూ కృష్ణా, గోదావరి సహా రాష్ట్రంలోని అన్ని జలవనరులు నిండుకుండలా మారి ఆంధ్రప్రదేశ్ సస్యశ్యామలంగా, సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. నీటి ప్రతి చుక్కను సద్వినియోగం చేసుకునేలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్రంలోని కీలక సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇచ్చి, అనేక ప్రాజెక్టులను పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించారని గద్దె అనురాధ పేర్కొన్నారు. గోదావరి జలాలను కృష్ణా బేసిన్‌కు తరలించే పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి కృష్ణా డెల్టాకు నీరందించిన ఘనత చంద్రబాబు నాయుడుకే దక్కుతుందన్నారు. అలాగే రాయలసీమకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో హంద్రీ–నీవా సుజల స్రవంతి, ప్రకాశం జిల్లాలోని వెలిగొండ ప్రాజెక్టు వంటి కీలక ప్రాజెక్టులను పూర్తి చేసి నీటిని అందుబాటులోకి తీసుకువచ్చిన ఘనత కూడా చంద్రబాబు నాయకత్వానిదేనన్నారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడంతో పాటు గోదావరి–కృష్ణా నదుల అనుసంధానం ద్వారా గోదావరి జలాలను కృష్ణా బేసిన్‌కు మళ్లించి రాష్ట్రంలోని కరువు ప్రాంతాలకు నీటిని అందించాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. పోలవరం, వెలిగొండ, హంద్రీ–నీవా, పట్టిసీమతో పాటు వివిధ ఎత్తిపోతల పథకాలు, సాగునీటి ప్రాజెక్టుల పనులను వేగవంతం చేయడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిరంతరం సమీక్షలు నిర్వహిస్తున్నారని తెలిపారు. ఎల్‌నినో వంటి వాతావరణ ప్రభావాల కారణంగా వర్షపాతం లోటు ఏర్పడే పరిస్థితులు ఉన్నప్పటికీ, అమ్మవారి దయతో రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి జలాశయాలు, నదులు, చెరువులు నిండాలని కోరుకున్నట్లు గద్దె అనురాధ తెలిపారు. ఇప్పటికే చంద్రబాబు నాయుడు పూర్తి చేసిన సాగునీటి ప్రాజెక్టులు, ప్రస్తుతం ప్రభుత్వం వేగవంతం చేస్తున్న ప్రాజెక్టులు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే ఆంధ్రప్రదేశ్ మరింత సస్యశ్యామలంగా మారుతుందన్నారు. రాష్ట్రంలోని ప్రతి ప్రాంతానికి సాగునీరు, ప్రజలకు తాగునీరు సమృద్ధిగా అందేలా చరిత్ర సృష్టిస్తూ ప్రాజెక్టులు నిర్మిస్తున్న చంద్రబాబు నాయుడు కృషికి దైవ సంకల్పం కూడా తోడవ్వాలని కాళీమాత అమ్మవారిని ప్రార్థించినట్లు గద్దె అనురాధ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యదర్శి జగదీష్ కుమార్, ఆధ్యాత్మిక వేత్త కిరణ్, ట్రస్ట్ బోర్డు సభ్యులు తుర్లపాటి మల్లేశ్వరరావు, నాయకులు పెద్ది అన్నారావు, తోట శ్రీను, కోట శివలక్ష్మి, దుర్గారావు, శివ, రవి, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
✍️ ప్రేమ్ రాజ్, విజయవాడ.