వైఎస్ఆర్సిపి నాయకుడు అంజాద్ భాష గృహ నిర్బంధం
మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ భాషా గృహనిర్బంధం
వైఎస్సార్సీపీ నేతలకు ఒక న్యాయం.. అధికార పార్టీ నేతలకు మరో న్యాయమా
పోలీసుల మోహరింపుపై అంజాద్ భాషా తీవ్ర ఆగ్రహం
*కడప: కడప నగరంలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై ఆంక్షలు విధిస్తూ, మాజీ డిప్యూటీ సీఎం, కడప మాజీ ఎమ్మెల్యే ఎస్.బి. అంజాద్ భాషాను పోలీసులు గృహనిర్బంధం చేశారు. ఆయన నివాసం వద్ద భారీగా పోలీసులను మోహరించి బయటకు వెళ్లకుండా ఆంక్షలు విధించడంపై అంజాద్ భాషా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
*ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల్లో పాల్గొనాల్సిన ప్రతిపక్ష నాయకులను గృహనిర్బంధం చేయడం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా అడ్డంకులు అడ్డుకొని దాడులు చేయడం ఎంతవరకు సమంజసం అని మండిపడ్డారు.
*వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు మాత్రమే ఎన్నికల కోడ్ వర్తిస్తుందా....అధికార పార్టీ నాయకులకు వర్తించదా....అని ఆయన ప్రశ్నించారు. అధికార పార్టీకి చెందిన నాయకులు పార్టీ కండువాలు ధరించి నామినేషన్ కేంద్రాల వద్దకు భారీ సంఖ్యలో అనుచరులతో చేరుతున్నా పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు.
*వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులపై కత్తులు, ఇనుప రాడ్లు, కర్రలతో దాడులు జరుగుతున్నాయని, అభ్యర్థులను భయభ్రాంతులకు గురిచేసి నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఎన్నికల్లో పోటీ చేయడం ప్రతి అభ్యర్థికి ఉన్న ప్రజాస్వామ్య హక్కు అని, ఆ హక్కును కాలరాసే ప్రయత్నాలను సహించేది లేదని స్పష్టం చేశారు.
*ప్రతిపక్ష నాయకులను అడ్డుకోవడంలో చూపిస్తున్న అత్యుత్సాహం.. దాడులకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవడంలో ఎందుకు కనిపించడం లేదని పోలీసు వ్యవస్థను ప్రశ్నించారు. చట్టం అందరికీ సమానంగా అమలు కావాలని, అధికార పార్టీకి ఒక న్యాయం.. ప్రతిపక్షానికి మరో న్యాయం ఉండకూడదని అన్నారు.
*ప్రజాస్వామ్యంలో ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా జరగాల్సి ఉండగా, భయాందోళనల మధ్య నామినేషన్లు దాఖలు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడటం ఆందోళనకరమని పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియలో ప్రతి అభ్యర్థికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత అధికార యంత్రాంగంపై ఉందన్నారు.
*గృహనిర్బంధాలతోనో, పోలీసుల మోహరింపుతోనో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను భయపెట్టలేరు. ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ కోసం, పార్టీ అభ్యర్థులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని అంజాద్ భాషా స్పష్టం చేశారు.
*ఎన్నికల సంఘం తక్షణమే స్పందించి నామినేషన్ కేంద్రాల వద్ద పరిస్థితులను సమీక్షించాలని, దాడులకు పాల్పడిన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు చర్యలు తీసుకోవాలని, ఆయన డిమాండ్ చేశారు.
కడప రిపోర్టర్ వేణు.