మహిళా సాధికారతే వికసిత్ భారత్కు పునాది: సీఎం చంద్రబాబు
విజయవాడ, మేజర్ న్యూస్: గ్రామీణ మహిళలను సంపద సృష్టికర్తలుగా, మహిళా పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. గ్రామీణ మహిళలు తయారు చేసే ఉత్పత్తులకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చేందుకు ‘స్వయం ఏపీ’ బ్రాండ్ను అందుబాటులోకి తెచ్చినట్లు వెల్లడించారు. విజయవాడలో గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జాతీయ సరస్ మేళా-2026ను ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ మహిళా సాధికారతే వికసిత్ భారత్కు పునాది అని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఏడాది కాలంలో లక్ష మంది స్వయం సహాయక సంఘాల సభ్యులు మహిళా పారిశ్రామికవేత్తలుగా ఎదిగారని, మరో ఐదు లక్షల మందిని ఆ దిశగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. జాతీయ సరస్ మేళాలో 650 స్వయం సహాయక సంఘాలు పాల్గొంటున్నాయని, ఈ 14 రోజుల ప్రదర్శన గ్రామీణ మహిళల ఉత్పత్తులకు విస్తృత మార్కెట్ అవకాశాలు కల్పించేందుకు దోహదపడాలని ఆకాంక్షించారు. మహిళల ఆదాయాన్ని పెంచడం, వారి ఉత్పత్తులకు గుర్తింపు తీసుకురావడం, కొత్త వ్యాపార అవకాశాలను అన్వేషించడం మేళా ప్రధాన ఉద్దేశమని వివరించారు. ఆంధ్రప్రదేశ్లో 11 లక్షల స్వయం సహాయక సంఘాల్లో 1.10 కోట్ల మంది సభ్యులు ఉన్నారని, వాటి ద్వారా రూ.69 వేల కోట్ల టర్నోవర్ నమోదవుతోందని వెల్లడించారు. మహిళలు ఉద్యోగాలు కోరుకునే స్థాయి నుంచి ఇతరులకు ఉపాధి కల్పించే స్థాయికి ఎదగాలని పిలుపునిచ్చారు. గ్రామీణ మహిళల ఉత్పత్తులను ఈ-కామర్స్, ఆన్లైన్ వేదికల ద్వారా ‘స్వయం ఏపీ’ బ్రాండ్తో మార్కెటింగ్ చేస్తామని తెలిపారు. వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాలను వ్యాపారాభివృద్ధికి వినియోగించుకోవాలని సూచించారు. సంక్షేమ పథకాలతో మహిళలకు భరోసా కల్పిస్తూనే ఆర్థిక స్వావలంబన సాధించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. స్త్రీశక్తి ఉచిత బస్సు ప్రయాణ పథకం ద్వారా మహిళలు ఇప్పటివరకు 100 కోట్ల ప్రయాణాలు చేశారని తెలిపారు. ప్రతి స్వయం సహాయక సంఘం ఆర్థిక శక్తిగా, ప్రతి మహిళ పారిశ్రామికవేత్తగా, ప్రతి గ్రామం ఉపాధి కేంద్రంగా ఎదగాలని ఆకాంక్షించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జీవితం మహిళలకు స్ఫూర్తిదాయకమని, సంకల్పబలం, ధైర్యంతో ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని ఆమె నిరూపించారని సీఎం పేర్కొన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్, కేంద్ర మంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్, పెమ్మసాని చంద్రశేఖర్, రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రులు కొండపల్లి శ్రీనివాస్, అనిత తదితరులు పాల్గొన్నారు.
స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా.