కలాం ఆశయాలతో వికసిత భారత్ నిర్మాణానికి కృషి చేయాలి: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్
విజయవాడ, మేజర్ న్యూస్: భారత మాజీ రాష్ట్రపతి, భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని విద్య, విజ్ఞానం, క్రమశిక్షణ, దేశభక్తి విలువలతో ముందుకు సాగుతూ వికసిత భారతదేశ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ పిలుపునిచ్చారు. విజయవాడ భవానీపురంలోని హెచ్ఓ కన్వెన్షన్లో రైట్ కంప్యూటర్స్, అబ్దుల్ కలాం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గురువారం డాక్టర్ అబ్దుల్ కలాం జయంతి వేడుకలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న పీవీఎన్ మాధవ్ కలాం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశానికి ఆయన అందించిన సేవలను, శాస్త్ర సాంకేతిక రంగంలో సాధించిన విజయాలను, యువతకు అందించిన స్ఫూర్తిదాయక సందేశాలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర మైనారిటీ మోర్చా అధ్యక్షుడు సయ్యద్ బాషా మాట్లాడుతూ యువత దేశానికి గొప్ప సంపద అని కలాం భావించేవారని తెలిపారు. విద్యార్థులు పెద్ద కలలు కని, వాటిని సాకారం చేసుకునేందుకు నిరంతరం శ్రమించాలని ఆయన ప్రోత్సహించారని పేర్కొన్నారు. విద్య, విజ్ఞానం, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని యువత దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని సూచించారు. బీజేపీ జాతీయ మైనారిటీ మోర్చా సోషల్ మీడియా కో-కన్వీనర్ జస్వంత్ జైన్ మాట్లాడుతూ కలాం దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమని, ఆయన జీవితం నేటి తరానికి ఆదర్శప్రాయమని అన్నారు. కలాం కలలుగన్న అభివృద్ధి చెందిన భారతదేశ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. యువత తమ ప్రతిభ, జ్ఞానాన్ని దేశ ప్రగతికి వినియోగించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్, రాష్ట్ర మీడియా కన్వీనర్ కిలారు దిలీప్, జంపని నిజాముద్దీన్ బాబా, ఎన్టీఆర్ జిల్లా మైనారిటీ మోర్చా ఇన్చార్జి దుర్భసుల హుస్సేన్, జిల్లా మైనారిటీ మోర్చా అధ్యక్షుడు మీరావలి తదితరులు పాల్గొన్నారు. మైనారిటీ మోర్చా నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా.