చైల్డ్ కేర్ హోమ్స్ సిబ్బందికి శిక్షణ
అనంతపురం బ్యూరో
చైల్డ్ కేర్ హోమ్స్ సిబ్బందికి శిక్షణ
పిల్లల హక్కులు, రక్షణ, పునరావాసంపై అవగాహన
అనంతపురం, సెప్టెంబర్ 29: అనంతపురం బుడ్డప్ప నగరంలోని మై భారత్ కేంద్రంలో జిల్లా బాలల పరిరక్షణ యూనిట్ ఆధ్వర్యంలో చైల్డ్ కేర్ హోమ్స్ నిర్వాహకులు, ఇన్‌చార్జ్‌లు, సిబ్బందికి మంగళవారం ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.
జిల్లా స్త్రీ, శిశు సంక్షేమం, సాధికారత అధికారి సాజిదా ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో జువెనైల్ జస్టిస్ యాక్ట్–2015, జేజే రూల్స్, పిల్లల సంరక్షణ, వ్యక్తిగత రికార్డుల నిర్వహణ, ఆరోగ్యం, విద్య, భద్రతా ప్రమాణాలు తదితర అంశాలపై అవగాహన కల్పించారు.
అలాగే పిల్లల కుటుంబ పునరేకీకరణ, Adoption, Sponsorship, Foster Care, After Care వంటి పునరావాస సేవలు, మిషన్ వాత్సల్య పోర్టల్‌లో పిల్లల వివరాల నమోదు, ప్రొఫైల్ అప్‌డేట్‌పై సాంకేతిక శిక్షణ అందించారు.
అధికారులు మాట్లాడుతూ.. చైల్డ్ కేర్ హోమ్స్‌లో పిల్లల హక్కులు, భద్రత, ఆరోగ్యం, విద్య, పోషకాహారానికి ప్రాధాన్యతనిస్తూ నిర్దేశిత ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. దీర్ఘకాలంగా హోమ్స్‌లో ఉంటున్న పిల్లలను గుర్తించి, అర్హత మేరకు కుటుంబ ఆధారిత సంరక్షణ, పునరావాస సేవలకు అనుసంధానం చేయాలని తెలిపారు.
కార్యక్రమంలో డీసీపీఓ మంజునాథ్, ప్రొటెక్షన్ ఆఫీసర్ ఎం.వెంకటేశ్వరి, అధికారులు, సాంకేతిక సిబ్బంది, చైల్డ్ కేర్ హోమ్స్ ప్రతినిధులు పాల్గొన్నారు.