భక్తుల సేవలో కలెక్టర్ నిరంతర పర్యవేక్షణ… కమాండ్ కంట్రోల్ కేంద్రంతో పాటు క్షేత్రస్థాయిలో విస్తృత తనిఖీలు
ఇంద్రకీలాద్రి, మేజర్ న్యూస్: దసరా ఉత్సవాల్లో ఐదో రోజైన గురువారం ఇంద్రకీలాద్రిపై శ్రీ లలితా త్రిపురసుందరీదేవిగా దర్శనమిస్తున్న జగన్మాతను దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అన్ని క్యూలైన్లలో భక్తులు క్రమబద్ధంగా ముందుకు సాగుతూ అమ్మవారి దర్శనం చేసుకుంటున్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో సేవలందిస్తున్నారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో క్యూలైన్లను పరిశీలిస్తూ, కొండ దిగువన ఏర్పాటు చేసిన సమీకృత కమాండ్ కంట్రోల్ కేంద్రం (ఐసీసీసీ) నుంచి ఉత్సవాల నిర్వహణ తీరును పర్యవేక్షిస్తున్నారు. సంబంధిత శాఖల అధికారులకు అవసరమైన సూచనలు, ఆదేశాలు జారీ చేస్తున్నారు. భక్తుల రద్దీ నియంత్రణ, వీవీఐపీ, వీఐపీ వాహనాల రాకపోకలు, జనసమూహాల నిర్వహణ, శాంతిభద్రతల పరిరక్షణలో కమాండ్ కంట్రోల్ కేంద్రం కీలక పాత్ర పోషిస్తోంది. నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలు, డ్రోన్ల ద్వారా అందుతున్న దృశ్యాలను నిరంతరం పరిశీలిస్తూ ఉత్సవాల నిర్వహణను పర్యవేక్షిస్తున్నారు. ఆధునిక కెమెరాల ద్వారా సేకరించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు విశ్లేషిస్తూ వాహనాల రాకపోకలు, ప్రవేశ, నిష్క్రమణ మార్గాలను నిశితంగా గమనిస్తున్నారు. ఘాట్ రోడ్డుపై ట్రాఫిక్ రద్దీ ఏర్పడకుండా, నిబంధనల ఉల్లంఘనలు జరగకుండా చర్యలు తీసుకుంటూ దసరా ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు అధికారులు, సిబ్బంది సమన్వయంతో కృషి చేస్తున్నారు.