ఆంపోలులో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం
- రూ.1.95 కోట్లతో జల్ జీవన్ మిషన్ పనులకు శంకుస్థాపన
- రూ.20 లక్షలతో నిర్మించిన ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ప్రారంభం
- శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్
గార సూర్య: గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధి, ప్రజారోగ్యం, మౌలిక వసతుల కల్పనకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. గార మండలం ఆంపోలు పంచాయతీ పరిధిలో బుధవారం పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శ్రీకారం చుట్టారు. గ్రామీణ నీటి సరఫరా, పారిశుధ్య శాఖ ఆధ్వర్యంలో జల్ జీవన్ మిషన్ (జేజేఎం) పథకం కింద రూ.1.95 కోట్ల అంచనా వ్యయంతో ప్రతి ఇంటికీ రక్షిత మంచినీటి కొళాయి కనెక్షన్లు కల్పించే పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. కొబ్బరికాయ కొట్టి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రతి పల్లెకూ స్వచ్ఛమైన, రక్షిత తాగునీటిని అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. జేజేఎం పనులను నాణ్యతా ప్రమాణాలతో, నిర్ణీత గడువులో వేగంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం పంచాయతీరాజ్ ఇంజనీరింగ్, వైద్య ఆరోగ్య శాఖల ఆధ్వర్యంలో *రూ.20 లక్షల వ్యయంతో నిర్మించిన ‘ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్–విలేజ్ హెల్త్ క్లినిక్’*ను ఎమ్మెల్యే రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. గ్రామీణ ప్రజలకు ప్రాథమిక వైద్య సేవలు స్థానికంగానే అందుబాటులోకి తీసుకురావడమే హెల్త్ క్లినిక్ ప్రధాన ఉద్దేశమని గొండు శంకర్ తెలిపారు. గ్రామస్తులు ఆరోగ్య కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, ఇంజనీరింగ్ సిబ్బంది, కూటమి నాయకులు, కార్యకర్తలు, ఆంపోలు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
రిపోర్టర్: గోపాల్ కృష్ణ, గార, శ్రీకాకుళం జిల్లా