|
|
by Suryaa Desk | Thu, Oct 16, 2025, 01:28 PM
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో అంతర్గత విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ దంపతుల వ్యవహారం అధికార పార్టీలో హాట్‌టాపిక్‌గా మారింది. ముఖ్యంగా మంత్రి మాజీ ఓఎస్‌డీ సుమంత్‌పై వచ్చిన అవినీతి ఆరోపణలు, ఆ తర్వాత ప్రభుత్వం ఆయన్ను విధుల నుంచి తప్పించడం వంటి పరిణామాలు ఈ వివాదాన్ని మరింత రాజేశాయి. బుధవారం రాత్రి ఓఎస్‌డీ కోసం పోలీసులు స్వయంగా మంత్రి ఇంటికి వెళ్లడం, దీనిపై కొండా దంపతుల కుమార్తె కొండా సుస్మిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం రాష్ట్ర రాజకీయాల్లో హైడ్రామా సృష్టించింది. ఈ ఘటనల పరంపరతో నేడు జరగబోయే కేబినెట్ సమావేశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
మరోవైపు, ఈ రాజకీయ రగడకు కులాల రంగు పులమడం కాంగ్రెస్‌లో కలకలం రేపింది. తమ కుటుంబంపై కొందరు 'రెడ్లు' కుట్ర చేస్తున్నారని కొండా సుస్మిత నేరుగా ఆరోపించడం వివాదాస్పదంగా మారింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో పాటు మరికొందరు నేతలను పరోక్షంగా లక్ష్యంగా చేసుకుని ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు.. బీసీ వర్సెస్ రెడ్డిగా అధికార పార్టీలో కొత్త కోణం తీసుకువచ్చాయి. ఇప్పటికే పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిపై టెండర్ల విషయంలో కొండా మురళి చేసిన కామెంట్లు విభేదాలకు కారణం కాగా, సుస్మిత వ్యాఖ్యలతో బీసీ మంత్రి అయిన తన తల్లిని అణగదొక్కే ప్రయత్నం జరుగుతోందనే ప్రచారం ఊపందుకుంది.
ఈ నేపథ్యంలో, ఇవాళ మధ్యాహ్నం జరగనున్న రాష్ట్ర కేబినెట్ సమావేశానికి మంత్రి కొండా సురేఖ హాజరు అవుతారా? లేదా? అనే దానిపై తీవ్ర సందిగ్ధత నెలకొంది. సుమంత్ విషయంలో ప్రభుత్వం తీరుపై ఆమె తీవ్ర అసంతృప్తితో ఉన్నారనే వార్తల నేపథ్యంలో, ఆమె కేబినెట్‌కు గైర్హాజరైతే అది ప్రభుత్వానికి మరింత ఇబ్బందికరంగా మారుతుంది. కొందరు సురేఖ రాజీనామా చేస్తారని భావిస్తుండగా, మరికొందరు ఆమెను తప్పించే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. అయితే, తాజా సమాచారం ప్రకారం ఆమె కేబినెట్ భేటీకి హాజరు కావాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తున్నప్పటికీ, అంతిమంగా ఏం జరుగుతుందనేది నేటి పరిణామాలు తేల్చనున్నాయి.
పార్టీలో పెరుగుతున్న ఈ అంతర్గత విభేదాలను కాంగ్రెస్ అధిష్ఠానం ఎలా పరిష్కరిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే కొండా సురేఖకు ఏఐసీసీ ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ నుంచి పిలుపు అందినట్లు సమాచారం. ఈ మొత్తం వివాదంపై మంత్రి సురేఖ కాసేపట్లో మీడియా సమావేశం నిర్వహించే అవకాశం ఉన్నందున, ఆమె ఎలాంటి ప్రకటన చేస్తారనేది రాజకీయ వర్గాలు ఉత్కంఠగా గమనిస్తున్నాయి. బీసీ రిజర్వేషన్లు, ఇతర కీలక అంశాలపై చర్చించేందుకు సమావేశమవుతున్న కేబినెట్ భేటీ వేదికగా ఈ విభేదాలకు పుల్‌స్టాప్ పడుతుందా, లేక మరింత రగులుతుందా అనేది నేటి రాజకీయ క్లైమాక్స్.